అమరావతికి మళ్లీ 'రాజధాని' కళ.. కార్మికులతో కిటకిటలాడుతున్న గ్రామాలు

  • ఐదేళ్ల నిశ్శబ్దం తర్వాత అమరావతి గ్రామాల్లో పండగ వాతావరణం
  • ఆదివారం షాపింగ్‌తో కిక్కిరిసిన వీధులు
  • ప్రస్తుతం పనుల్లో 13 వేల మంది 
  • జనవరి నాటికి మరో 30 వేల మంది రాక
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పూర్వ వైభవం కనిపిస్తోంది. ఐదేళ్లుగా నిర్మాణ ప్రాంతాల్లో నెలకొన్న నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ.. ఇప్పుడు ఎక్కడ చూసినా కార్మికుల సందడి, యంత్రాల హోరు వినిపిస్తోంది. ముఖ్యంగా ఆదివారం సెలవు కావడంతో వేలాది మంది కార్మికులు నిత్యావసరాలు, బట్టల కొనుగోలు కోసం రాజధాని గ్రామాల్లోని రోడ్ల మీదకు రావడంతో ఆయా ప్రాంతాలు జాతరను తలపించాయి.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పనులకు మళ్లీ మోక్షం లభించింది. ప్రస్తుతం వివిధ నిర్మాణాల్లో 13 వేల మంది కార్మికులు నిమగ్నమై ఉండగా, జనవరి నుంచి పనుల వేగం మూడు రెట్లు పెరగనుంది. ఇందుకోసం కాంట్రాక్టు సంస్థలు ఇప్పటికే మానవ వనరుల సరఫరా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. జనవరిలో మరో 30 వేల మంది కార్మికులు అమరావతిలో అడుగుపెట్టబోతున్నారు.

కేవలం భవనాలే కాకుండా రైతులకు కేటాయించిన ప్లాట్లలో రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల పనులు కూడా ఊపందుకున్నాయి. ట్రంక్ రోడ్లు, ఐకానిక్ భవనాల నిర్మాణానికి అవసరమైన టెండర్ల ప్రక్రియ కూడా తుది దశకు చేరుకుంది. 2014-19 మధ్య అమరావతిలో ఏ స్థాయిలో సందడి ఉండేదో, సరిగ్గా అలాంటి అద్భుత దృశ్యం మళ్లీ నవనగరంలో ఆవిష్కృతం అవుతోంది.


More Telugu News