Nagababu: పోలవరం ప్రాజెక్టుకు పొట్టి శ్రీరాములు పేరు... పవన్ సూచనను సమర్థిస్తున్నాం: నాగబాబు

Nagababu Supports Naming Polavaram Project After Potti Sriramulu
  • పోలవరం ప్రాజెక్టుకు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలన్న పవన్ సూచన
  • తెలుగు వారి కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడిన నాగబాబు
  • మంగళగిరిలో జనసేన పార్టీలో చేరిన పలువురు ఆర్యవైశ్యులు
  • పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని కొత్త సభ్యులకు నేతల పిలుపు
పోలవరం ప్రాజెక్టుకు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలంటూ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన సూచనను తాను బలంగా సమర్థిస్తున్నట్లు ఎమ్మెల్సీ, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు స్పష్టం చేశారు. తెలుగు వారి కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహనీయుడిని ఆ విధంగా గౌరవించుకోవాలని ఆయన అన్నారు.

ఆదివారం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌లో చార్టర్డ్ అకౌంటెంట్ పెనుగొండ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ, “ఆర్యవైశ్యులు అనగానే మొదట గుర్తుకొచ్చేది పొట్టి శ్రీరాములే. నెల్లూరులో డిగ్రీ చదివేటప్పుడు రోజూ ఆయన విగ్రహానికి నమస్కరించి తరగతికి వెళ్లేవాడిని. ఆయన జీవితం ఎందరికో ఆదర్శం. గతంలో ప్రాజెక్టులకు రాజకీయ నాయకుల పేర్లు పెట్టే సంప్రదాయాన్ని పక్కనపెట్టి, గోదావరి జిల్లాల్లోని ఒక తాగునీటి ప్రాజెక్టుకు పవన్ కల్యాణ్ గారు ఇప్పటికే పొట్టి శ్రీరాములు పేరు పెట్టారు” అని గుర్తుచేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ ప్రజాసేవకే అంకితమయ్యారని, 14 ఏళ్లుగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చారని అన్నారు. జనసేన మూల సిద్ధాంతాలకు ఎంతో విశిష్టత ఉందని, పార్టీలో కొత్తగా చేరిన వారు ఆ సిద్ధాంతాలను అర్థం చేసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అనంతరం కొత్త సభ్యులతో పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తామని ప్రమాణం చేయించారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కళ్యాణం శివశ్రీనివాస్, ఏపీఎంఎస్‌ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, తదితర జనసేన నాయకులు పాల్గొన్నారు.
Nagababu
Pawan Kalyan
Potti Sriramulu
Polavaram Project
Janasena Party
Andhra Pradesh
Arya Vysya
Pidugu Hariprasad
CK Convention Center
Mangalagiri

More Telugu News