హాదీని చంపిన హంతకులు భారత్ కు పారిపోయారు: బంగ్లాదేశ్ పోలీసులు

  • హాదీ హత్య కేసు నిందితులు భారత్‌కు పరారీ
  • ఈ విషయాన్ని ధృవీకరించిన బంగ్లాదేశ్ పోలీసులు
  • మేఘాలయ సరిహద్దు ద్వారా దేశం దాటిన వైనం
  • షేక్ హసీనా ప్రభుత్వ పతనంలో హాదీ కీలక పాత్ర
  • నిందితులను అప్పగించాలని భారత్‌తో బంగ్లా సంప్రదింపులు
బంగ్లాదేశ్‌ను కుదిపేసిన విద్యార్థి ఉద్యమ నేత షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు భారత్‌కు పారిపోయినట్లు బంగ్లాదేశ్ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు (డీఎంపీ) ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.

ప్రధాన నిందితులు ఫైసల్ కరీం మసూద్, అలంగీర్ షేక్‌లు మేఘాలయలోని తురా నగరంలో తలదాచుకున్నట్లు గుర్తించామని అదనపు పోలీస్ కమిషనర్ నజ్రుల్ ఇస్లాం తెలిపారు. సహచరుల సాయంతో వారు హలువాఘాట్ సరిహద్దు ద్వారా మేఘాలయలోకి ప్రవేశించారని వివరించారు. అక్కడ వారికి 'పూర్తీ, 'సమి' అనే ఇద్దరు వ్యక్తులు ఆశ్రయం కల్పించారని, వారిని భారత భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నట్లు తమకు అనధికారిక సమాచారం ఉందని పేర్కొన్నారు. నిందితులను అరెస్ట్ చేసి తమకు అప్పగించాలని అధికారిక, అనధికారిక మార్గాల ద్వారా భారత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.

గత ఏడాది జులై-ఆగస్టులో జరిగిన విద్యార్థి ఉద్యమంలో హాదీ కీలక పాత్ర పోషించారు. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వ పతనానికి ఈ ఉద్యమమే కారణమైంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 12న ఢాకాలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా, రిక్షాలో వెళుతున్న హాదీపై దుండగులు అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన హాదీ, సింగపూర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 18న కన్నుమూశారు.

ఈ హత్య కేసులో ఇప్పటివరకు 11 మందిని అరెస్ట్ చేశామని, వారిలో ఆరుగురు నేరాన్ని అంగీకరించారని పోలీసులు తెలిపారు. మరో 7 నుంచి 10 రోజుల్లో ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తామని వెల్లడించారు.


More Telugu News