DK Shivakumar: బెంగళూరులో 'బుల్డోజర్' చిచ్చు.. సొంత ప్రభుత్వంపైనే కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్

Bengaluru Encroachment Drive Congress High Command Intervenes
  • యలహంక కూల్చివేతలపై వెల్లువెత్తిన నిరసనలు
  • మానవీయ కోణంలో ఆలోచించాలంటూ సీఎం, డిప్యూటీ సీఎంలకు హైకమాండ్ ఆదేశం
  • కర్ణాటక సర్కార్‌పై కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్ర విమర్శలు
  • కౌంటర్ ఇచ్చిన డీకే శివకుమార్
బెంగళూరు శివార్లలోని కోగిలు గ్రామంలో చేపట్టిన ఆక్రమణల తొలగింపు కార్యక్రమం కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. నిరుపేదల ఇళ్లను కూల్చివేయడంపై స్థానికుల నుంచి నిరసనలు వ్యక్తమవడమే కాకుండా, రాజకీయంగానూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ శనివారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లతో మాట్లాడారు.

కూల్చివేతల విషయంలో ప్రభుత్వం అనుసరించిన తీరుపై ఏఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇటువంటి సున్నితమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని, పేదల పట్ల సానుభూతితో వ్యవహరించాలని వేణుగోపాల్ సూచించారు. బాధితులకు తక్షణమే పునరావాసం కల్పించి, వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. దీనిపై స్పందించిన సీఎం సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఈ కూల్చివేతలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఫేస్‌బుక్ వేదికగా తీవ్రంగా స్పందించారు. బెంగళూరులోని ఫకీర్ కాలనీ కూల్చివేత దిగ్భ్రాంతికరమని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉత్తరాది రాష్ట్రాల తరహాలో 'బుల్డోజర్ రాజకీయాలను' ప్రోత్సహించడం బాధాకరమని విమర్శించారు. అయితే, ఈ విమర్శలను డీకే శివకుమార్ గట్టిగా తిప్పికొట్టారు. బయటి నాయకులు ఇక్కడి పరిస్థితులు తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదని, తాము ప్రభుత్వ భూములను పరిరక్షించడానికే ఈ చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.

అది వ్యర్థాలను పారబోసే ప్రాంతమని, అక్కడ నివాసాలు ఉండటం సురక్షితం కాదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వివరించారు. ఆక్రమణదారులకు ముందే నోటీసులు ఇచ్చామని, స్పందించకపోవడంతోనే ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. అయినప్పటికీ, మానవీయ కోణంలో అక్కడ నివసిస్తున్న వలస కూలీలకు తాత్కాలిక వసతి, ఆహారం అందించాలని బీబీఎంపీ అధికారులను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు.
DK Shivakumar
Karnataka
Bengaluru
Bulldozer politics
Congress
Siddaramaiah
Kogilu
Eviction drive
Pinarayi Vijayan
AICC

More Telugu News