Deepu Das: 'నరరూప రాక్షసుల్లా దాడి చేశారు'.. దీపు దాస్ హత్యపై ప్రత్యక్ష సాక్షి

Eyewitness Describes Deepu Das Murder in Bangladesh
  • మత దూషణ వదంతులతో బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడిపై మూకదాడి
  • ఫ్యాక్టరీ నుంచి ఈడ్చుకెళ్లి.. చెట్టుకు వేలాడదీసి సజీవ దహనం 
  • ప్రాణ భయంతో నోరు మెదపలేకపోయామన్న తోటి కార్మికుడు
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అరాచకాలకు దీపు చంద్ర దాస్ హత్య సజీవ సాక్ష్యం. ఈ దారుణ మారణకాండ జరిగిన సమయంలో అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్షి వెల్లడించిన భయానక వివరాలు ఇప్పుడు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. నిందితుల నుంచి ప్రాణహాని ఉందని భావించిన సదరు సాక్షి, ముఖం కనిపించకుండా 'ఎన్డీటీవీ' ప్రతినిధులతో మాట్లాడుతూ ఆనాటి రక్తపాతాన్ని వివరించాడు.

దీపు చంద్ర దాస్ ఒక చిన్నారికి తండ్రి. ఫ్యాక్టరీలో అతడు కష్టపడి పనిచేయడం చూసి ఓర్వలేక కొందరు వ్యక్తులు అతడు 'మత దూషణ' చేశాడని తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. "మొదట అతడిని బలవంతంగా రాజీనామా చేయించారు. ఆ తర్వాత ఫ్యాక్టరీ గేటు బయట వేచి ఉన్న వందలాది మంది ఉన్మాదులకు అతడిని అప్పగించారు" అని సాక్షి కన్నీటి పర్యంతమయ్యాడు.

గేటు బయట ఉన్న మూకలు దీపుపై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశాయి. రక్తం ఓడుతున్నా వదలకుండా ముఖం, ఛాతీపై బాదారు. "అతడు రక్షించాలని ప్రాధేయపడుతున్నా ఎవరమూ వెళ్లలేకపోయాం. ఆ మూకలు నరరూప రాక్షసుల్లా ప్రవర్తించాయి. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లి, ఒక చెట్టుకు కట్టేసి నిప్పు పెట్టారు" అని సాక్షి వివరించాడు. ఆ తర్వాత జరిగిన విచారణలో దీపు ఎటువంటి తప్పు చేయలేదని, అతడికి మత దూషణతో సంబంధం లేదని అధికారులు తేల్చారు.

ఈ ఘటన బంగ్లాదేశ్‌లోని హిందువుల్లో తీవ్ర భయాందోళనలను నింపింది. అవామీ లీగ్ మద్దతుదారులనే లక్ష్యంగా చేసుకుంటున్నామని ఇస్లామిక్ గ్రూపులు చెబుతున్నప్పటికీ, అది కేవలం ఒక ముసుగు మాత్రమేనని స్థానికులు వాపోతున్నారు. హిందువులను ఊరి నుంచి వెళ్లగొట్టడమే లక్ష్యంగా ఇటువంటి దాడులు జరుగుతున్నాయని, తాత్కాలిక ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Deepu Das
Bangladesh Hindu
Hindu Persecution
Religious Violence
Bangladesh Riots
Islamic Extremism
Communal Violence
Awami League
Minority Rights

More Telugu News