Bandu Andekar: పుణె మున్సిపల్ ఎన్నికల్లో 'గ్యాంగ్‌స్టర్' హల్‌చల్: కట్టేసిన చేతులు.. ముఖానికి నల్లటి గుడ్డతో వచ్చి నామినేషన్!

Bandu Andekar Gangster Files Nomination in Pune Municipal Elections
  • మనవడి హత్య కేసులో జైల్లో ఉండి ఎన్నికల బరిలోకి దిగుతున్న బందు అందేకర్
  • పోలీసుల పహారాలో, భారీ బందోబస్తు మధ్య నామినేషన్ దాఖలు
  • కోర్టు షరతులతో కూడిన అనుమతితో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ
పుణెలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. స్థానిక గ్యాంగ్‌స్టర్, మనవడి హత్య కేసులో ప్రధాన నిందితుడైన బందు అందేకర్ శనివారం నామినేషన్ దాఖలు చేశాడు. ప్రస్తుతం ఎరవాడ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న అతడు భారీ పోలీసు భద్రత నడుమ ప్రభుత్వ కార్యాలయానికి చేరుకున్నాడు.

పోలీసు వ్యాన్ లో వచ్చిన బందు అందేకర్ చేతులకు తాళ్లు కట్టి ఉండగా, ముఖానికి నల్లటి గుడ్డ కప్పి ఉంది. భవానీ పేటలోని నామినేషన్ కేంద్రానికి తీసుకురాగానే పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ లోపలికి వెళ్లాడు. మనవడు ఆయుష్ కోమ్కర్ హత్య కేసులో అందేకర్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రత్యేక కోర్టు అనుమతి ఇవ్వడంతో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగాడు.

అందేకర్ మాత్రమే కాకుండా, ఇదే కేసులో నిందితులుగా ఉన్న అతడి సోదరుడి భార్య లక్ష్మి అందేకర్, కోడలు సోనాలి అందేకర్ కూడా కోర్టు అనుమతితో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. పుణె మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు మరో 28 సంస్థలకు జనవరి 15న ఎన్నికలు జరగనున్నాయి.

మాజీ కార్పొరేటర్, బందు అందేకర్ కుమారుడు వనరాజ్ అందేకర్ గతంలో హత్యకు గురయ్యాడు. దీనికి ప్రతీకారంగానే మనవడు ఆయుష్ కోమ్కర్‌ను సెప్టెంబర్ 5న కాల్చి చంపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ దారుణ హత్య వెనుక అందేకర్ గ్యాంగ్ ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి. 
Bandu Andekar
Pune Municipal Corporation Elections
Gangster
Ayush Komkar Murder Case
Erawada Central Jail
Maharashtra Elections
Crime
Pune Politics
Municipal Elections India
Vanraj Andekar

More Telugu News