Nara Bhuvaneshwari: ఎన్టీఆర్ కు మేమిచ్చే నివాళి ఇదే: నారా భువనేశ్వరి

Nara Bhuvaneshwari Says This is Our Tribute to NTR
  • ఎన్టీఆర్ స్ఫూర్తితోనే ట్రస్ట్ సేవలందిస్తోందన్న భువనేశ్వరి
  • పేదలు, అనాథలకు ఉచిత విద్య, మహిళలకు ఉపాధి కల్పిస్తున్నామని వెల్లడి
  • హెల్త్ కేర్, సివిల్స్ అకాడెమీ ద్వారా యువతకు చేయూత
  • ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు అండగా నిలుస్తున్నామని వివరణ
  • ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించడమే ఆయనకు ఇచ్చే నివాళి అని ఉద్ఘాటన
తన తండ్రి దివంగత ఎన్టీ రామారావు స్ఫూర్తితో, ఆయన చూపిన బాటలోనే ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోందని మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. 'మానవ సేవే మాధవ సేవ' అనే ఎన్టీఆర్ సిద్ధాంతానికి అనుగుణంగానే ట్రస్ట్ పనిచేస్తోందని ఆమె స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని గండిపేటలో జరిగిన ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకలకు ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంతో పాటు సమాజంలోని పేద వర్గాలకు అండగా నిలవడమే తమ లక్ష్యమని చెప్పారు. "పేద, అనాథ పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నాం. సివిల్ సర్వీసెస్ అకాడెమీ ద్వారా యూపీఎస్సీ అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నాం. హెల్త్ కేర్, తలసేమియా సెంటర్, ఎన్టీఆర్ సంజీవని క్లినిక్కుల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నాం" అని వివరించారు.

అంతేకాకుండా, ‘స్త్రీశక్తి’ ద్వారా పేద మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ‘ఎన్టీఆర్ సుజల’ పథకం ద్వారా సురక్షిత తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామన్నారు. పేదల జీవితాలను మెరుగుపరచడం, కుటుంబాలను ఆదుకోవడమే ఎన్టీఆర్‌కు తామిచ్చే నిజమైన నివాళి అని భువనేశ్వరి పేర్కొన్నారు. బాహ్య ప్రపంచంలోని సవాళ్లను ఎదుర్కొనేందుకు విద్యార్థులు ఇక్కడి నుంచే సంసిద్ధులు కావాలని ఆమె పిలుపునిచ్చారు.

స్పూర్తినిచ్చారు... కెరీర్ తీర్చిదిద్దారు!

ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవంలో ఆ సంస్ధలో చదువుకున్న పూర్వ విద్యార్థులు పలువురు ప్రసంగించారు. తనకు విద్యాబుద్దులు నేర్పించి... చక్కటి భవిష్యత్తు కల్పించిన సీఎం చంద్రబాబు దంపతులకు పూర్వ విద్యార్థి హరికృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం తాను సినాప్సిస్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నట్టు హరికృష్ణ వెల్లడించారు. అలాగే ఎన్టీఆర్ విద్యా సంస్థలే తన కెరీర్ ను తీర్చిదిద్దాయని మరో పూర్వ విద్యార్థిని ఉమ శ్రీ చెప్పారు. ఎయిర్ హోస్టెస్ అయిన తాను ఎంటర్ ప్రెన్యూయర్ గా కొనసాగుతున్నట్టు ఉమ శ్రీ వెల్లడించారు. 

 ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ విద్యా సంస్థల యాన్యువల్ రిపోర్టులను స్కూల్, కాలేజీ ప్రిన్సిపాల్స్ జోజి రెడ్డి, రామరావు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్, హెరిటెజ్ ఫుడ్స్ సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.
Nara Bhuvaneshwari
NTR Trust
Chandrababu Naidu
NTR Educational Institutions
Andhra Pradesh
Telangana
Education
Charity
Healthcare
NTR Sujala

More Telugu News