Sukhvinder Singh Sukhu: గంజాయి సాగుకు హిమాచల్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్... కానీ...!

Himachal Pradesh Legalizes Hemp Cultivation Under Green to Gold Scheme
  • పారిశ్రామిక గంజాయి సాగును చట్టబద్ధం చేసిన హిమాచల్ ప్రదేశ్
  • 'గ్రీన్ టు గోల్డ్' పేరుతో కొత్త విధానాన్ని ప్రారంభించిన సుఖు ప్రభుత్వం
  • ఏటా రూ. 2,000 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా
  • కోతుల బెడదతో నష్టపోతున్న రైతులకు ప్రత్యామ్నాయ పంట
  • మత్తు కలిగించని 0.3 శాతం కంటే తక్కువ THC ఉండేలా నిబంధనలు
హిమాచల్ ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించే గంజాయి (హెంప్) సాగును నియంత్రిత పద్ధతిలో చట్టబద్ధం చేస్తూ 'గ్రీన్ టు గోల్డ్' అనే కొత్త విధానాన్ని ప్రారంభించింది. ఈ కార్యాచరణ ద్వారా 2027 నాటికి రాష్ట్రాన్ని ఆర్థికంగా స్వావలంబన దిశగా నడిపించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.

దశాబ్దాలుగా కులు, మండీ, చంబా లోయల్లో అక్రమ మాదకద్రవ్యంగా పేరొందిన గంజాయి మొక్కను, ఇకపై పారిశ్రామిక సంపదగా మార్చనున్నారు. ఈ విధానంలో భాగంగా, మత్తు కలిగించని విధంగా 0.3 శాతం కంటే తక్కువ టెట్రాహైడ్రోకెనబినాల్ (THC) ఉన్న గంజాయి మొక్కలనే సాగు చేసేందుకు అనుమతిస్తారు. దీన్ని నొప్పి నివారిణి గానూ, కణజాల వాపు తగ్గించడానికి విరివిగా ఉపయోగిస్తారు. తాజాగా టెక్స్‌టైల్స్, బయో-ప్లాస్టిక్స్, ఔషధాలు, కాస్మెటిక్స్, బయో ఫ్యూయల్ వంటి అనేక పరిశ్రమల్లో వినియోగించనున్నారు.

ఈ నిర్ణయం వల్ల రాష్ట్రానికి ఏటా రూ. 1,000 కోట్ల నుంచి రూ. 2,000 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ముఖ్యంగా వన్యప్రాణులు, కోతుల బెడదతో సంప్రదాయ పంటలు పండించలేక నష్టపోతున్న రైతులకు పారిశ్రామిక గంజాయి సాగు ఒక గొప్ప ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి సుఖు తెలిపారు. దీనికి నీటి వినియోగం కూడా తక్కువని, వాతావరణ మార్పులను సైతం తట్టుకుంటుందని ఆయన వివరించారు.

ఈ విధానం అమలు కోసం ప్రభుత్వం ఇప్పటికే ఒక పైలట్ ప్రాజెక్టును సిద్ధం చేసింది. రెవెన్యూ మంత్రి జగత్ సింగ్ నేగి నేతృత్వంలోని కమిటీ ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి విధానాలను అధ్యయనం చేసిన తర్వాతే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ చొరవతో హిమాచల్ ప్రదేశ్‌ను 'హెంప్-హబ్'గా తీర్చిదిద్ది, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.
Sukhvinder Singh Sukhu
Himachal Pradesh
Hemp cultivation
Green to Gold scheme
Industrial hemp
Cannabis farming
Himachal economy
Hemp hub
Tetrahydrocannabinol
Agriculture

More Telugu News