Divvela Madhuri: మహిళల డ్రెస్సింగ్‌పై నాగబాబు, అనసూయలకు దివ్వెల మాధురి కౌంటర్

Divvela Madhuri Counter to Naga Babu and Anasuya on Womens Dressing
  • మహిళల వస్త్రధారణపై నాగబాబు వ్యాఖ్యలను ఖండించిన దివ్వెల మాధురి
  • బట్టలు విప్పుకుని తిరగడం స్వేచ్ఛ కాదని స్పష్టీకరణ
  • డ్రెస్సింగ్‌ను బట్టే సమాజంలో గౌరవం ఉంటుందని వ్యాఖ్య
  • గతంలో అనసూయ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్
  • భారతీయ సంస్కృతిని కాపాడుకోవాలని మహిళలకు పిలుపు
నటుడు శివాజీ ఇటీవల దండోరా చిత్ర ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాన్ని రగిల్చాయి. శివాజీ వ్యాఖ్యలను తప్పుబడుతూ నటి అనసూయ తీవ్రంగా స్పందించగా, అనసూయకు మెగాబ్రదర్ నాగబాబు మద్దతు పలికారు. అయితే, ఈ సందర్భంగా నాగబాబు చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ దివ్వెల మాధురి ఖండించారు. 
 
మహిళల వస్త్రధారణ, వ్యక్తిగత స్వేచ్ఛపై నటుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ యూట్యూబ్ వీడియోలో తన అభిప్రాయాలను పంచుకున్నారు. మగవారితో సమానంగా ఉండాలంటే బట్టలు విప్పుకుని తిరగడం కాదని, మహిళలు ఆర్థికంగా ఎదగడమే నిజమైన స్వేచ్ఛ అని ఆమె స్పష్టం చేశారు. అర్ధనగ్నంగా ఉండటాన్ని వ్యక్తిగత స్వేచ్ఛగా భావించలేమని తేల్చిచెప్పారు.

వస్త్రధారణను బట్టే సమాజంలో గౌరవం లభిస్తుందని మాధురి అభిప్రాయపడ్డారు. సంప్రదాయబద్ధంగా ఉండే మహిళలను చూసే విధానానికి, అసభ్యకరంగా బట్టలు వేసుకున్న వారిని చూసే చూపుకు తేడా ఉంటుందని ఆమె వివరించారు. విదేశీయులే మన చీరకట్టును, సంస్కృతిని గౌరవిస్తుంటే, మనం మాత్రం పాశ్చాత్య వ్యామోహంలో పడి మన మూలాలను మరిచిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా యాంకర్ అనసూయ గతంలో చేసిన వ్యాఖ్యలపైనా మాధురి స్పందించారు. "నా డ్రెస్సింగ్ గురించి నా భర్తకు లేని అభ్యంతరం మీకెందుకు?" అన్న అనసూయ వ్యాఖ్యలను ఆమె తప్పుబట్టారు. భర్త దగ్గర ఎలా ఉన్నా పర్వాలేదని, కానీ బహిరంగ ప్రదేశాల్లో అర్ధనగ్నంగా ఉంటూ అందరూ తనను అన్నదమ్ముల్లా చూడాలంటే అది సాధ్యం కాదని అన్నారు. చూసే చూపు కచ్చితంగా వేసుకున్న బట్టల మీద ఆధారపడి ఉంటుందని వాదించారు. మహిళలు ఆధునిక దుస్తులు ధరించవచ్చని, కానీ అవి అసభ్యకరంగా ఉండకూడదని, భారతీయ సంస్కృతిని కాపాడాలని ఆమె పిలుపునిచ్చారు.


Divvela Madhuri
Naga Babu
Anasuya
dress code controversy
women's clothing
Indian culture
social media influencer
Dandora movie event
Shivaji comments
women empowerment

More Telugu News