"చెత్త బండిలో మహిళ మృతదేహం తరలింపు"... ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ ఇదిగో!

  • చెత్త బండిలో మృతదేహం తరలింపు వార్తల్లో నిజం లేదన్న సర్కారు
  • పార్వతీపురం మన్యం జిల్లా భద్రగిరి ఘటనపై అధికారుల స్పష్టత
  • మృతురాలి సోదరుడే తన సరుకు రవాణా వాహనంలో తీసుకెళ్లారని వివరణ
  • అంబులెన్స్ ఏర్పాటు చేస్తామన్నా వేచి ఉండలేదని వెల్లడి
  • వైద్యంలో ఎలాంటి నిర్లక్ష్యం జరగలేదని స్పష్టీకరణ
పార్వతీపురం మన్యం జిల్లా భద్రగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో వృద్ధురాలి మృతదేహాన్ని చెత్త తీసుకెళ్లే వాహనంలో తరలించారంటూ మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని స్పష్టత వచ్చింది. ఈ సంఘటనను కొన్ని మాధ్యమాలు వక్రీకరించాయని, అసలు వాస్తవాలు వేరని సంబంధిత వర్గాలు వివరణ ఇచ్చాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ విడుదల చేసింది.

వివరాల్లోకి వెళితే, డయాబెటిస్, హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్న కె. రాధమ్మ (65) అనే మహిళ, కొంతకాలంగా మందులు వాడకపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబసభ్యులు ఆమెను భద్రగిరి ఆసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందించారు. అయినప్పటికీ పరిస్థితి విషమించి ఆమె శుక్రవారం మరణించింది.

ఆసుపత్రి నుంచి కేవలం కిలోమీటర్ దూరంలో ఉన్న వారి ఇంటికి మృతదేహాన్ని తరలించేందుకు సిబ్బంది అంబులెన్స్ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. అయితే, మృతురాలి సోదరుడు అంబులెన్స్ కోసం వేచి ఉండకుండా, తన సొంత మూడు చక్రాల వాహనంలోనే మృతదేహాన్ని తీసుకెళ్లాడు. ఆ వాహనం చెత్త తరలించేది కాదని, అది ఒక సరుకు రవాణా వాహనమని అధికారులు స్పష్టం చేశారు.

వైద్య సహాయం అందించడంలో గానీ, మృతదేహ తరలింపు ఏర్పాట్లలో గానీ ఎటువంటి నిర్లక్ష్యం జరగలేదని, ఈ దురదృష్టకర సంఘటనపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. ఈ వాస్తవాలు స్థానిక విలేకరులకు కూడా తెలుసని వారు పేర్కొన్నారు.


More Telugu News