India Tech Investment: భారత్‌లో డాలర్లు కుమ్మరిస్తున్న అమెరికా టెక్ దిగ్గజాలు... న్యూయార్క్ టైమ్స్ లో ఆసక్తికర కథనం

India Tech Investment US Tech Giants Investing Billions
  • భారత్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్న అమెరికన్ టెక్ కంపెనీలు
  • డేటా సెంటర్లు, ఏఐ రంగంలోకి 67.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
  • మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్ వంటి దిగ్గజాల భారీ ప్రణాళికలు
  • స్థానిక డేటా నిల్వ నిబంధనలు, డిజిటల్ వృద్ధే పెట్టుబడులకు కారణం
  • హైదరాబాద్ వంటి నగరాలు డేటా సెంటర్లకు కేంద్రంగా ఆవిర్భావం
భారత్ ఇప్పుడు గ్లోబల్ డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మౌలిక సదుపాయాలకు కీలక కేంద్రంగా అవతరిస్తుండటంతో, అమెరికాకు చెందిన టెక్ దిగ్గజాలు మన దేశంలో పదుల బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, మెటా వంటి సంస్థలు ఈ పెట్టుబడుల ప్రవాహంలో ముందున్నాయని ప్రముఖ అమెరికన్ పత్రిక ‘న్యూయార్క్ టైమ్స్’ శనివారం తన కథనంలో వెల్లడించింది. ఈ భారీ పెట్టుబడులు భారతదేశ డిజిటల్ రూపురేఖలను సమూలంగా మార్చేస్తున్నాయని, ప్రపంచవ్యాప్తంగా డేటా నిల్వ, కంప్యూటింగ్ పవర్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను ఇది స్పష్టం చేస్తోందని పేర్కొంది.

పెట్టుబడుల వివరాలను పరిశీలిస్తే, మైక్రోసాఫ్ట్ సంస్థ భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టుల కోసం ఏకంగా 17.5 బిలియన్ డాలర్లు కేటాయించింది. మరోవైపు, అమెజాన్ రాబోయే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా ఏఐ ఆధారిత కార్యక్రమాల కోసం 35 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు ప్రకటించింది. 

ఇక గూగుల్ సంస్థ, భారతీయ దిగ్గజాలైన అదానీ గ్రూప్, భారతీ ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుని డేటా సెంటర్ల ఏర్పాటుకు 15 బిలియన్ డాలర్లు వెచ్చించనుంది. గూగుల్ ఏర్పాటు చేయనున్న ప్రదేశానికి సమీపంలోనే మెటా కూడా ఒక భారీ కేంద్రాన్ని నిర్మిస్తోంది. ఇతర భారతీయ పారిశ్రామిక సంస్థల ప్రాజెక్టులు వీటికి అదనం. మొత్తం కలిపి ఈ పెట్టుబడుల విలువ కనీసం 67.5 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.5.6 లక్షల కోట్లు) చేరుకుంది. 

ముంబైకి చెందిన ఏఎస్‌కే వెల్త్ అడ్వైజర్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ సోమనాథ్ ముఖర్జీ మాట్లాడుతూ, "భారత్‌లో ఒకే రంగంలో ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులు రావడం బహుశా ఇదే తొలిసారి" అని న్యూయార్క్ టైమ్స్‌కు తెలిపారు.

భారతదేశ వేగవంతమైన డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, విస్తారమైన వినియోగదారుల సంఖ్యపై ఈ కంపెనీలు భారీ అంచనాలు పెట్టుకున్నాయి. ప్రపంచంలోని డేటాలో దాదాపు 20 శాతం ఇక్కడే ఉత్పన్నమవుతున్నా, గ్లోబల్ స్టోరేజ్ సామర్థ్యంలో మన వాటా చాలా తక్కువగా ఉంది. "ప్రపంచంలోనే అత్యధికంగా డేటాను వినియోగించే దేశం భారత్. కానీ అమెరికా డేటా సామర్థ్యంలో ఇక్కడ కేవలం ఐదు శాతం మాత్రమే ఉంది" అని ముఖర్జీ వివరించారు. అమెరికా, భారత్ మధ్య వాణిజ్యపరమైన ఘర్షణలు ఉన్నప్పటికీ ఈ పెట్టుబడులు ముందుకు సాగడం గమనార్హం.

విదేశీ సర్వర్లపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం కూడా డేటాను స్థానికంగానే నిల్వ చేయాలనే నిబంధనలను పరిశీలిస్తోంది. 2018 నుంచి డిజిటల్ సేవలు దేశంలోని సర్వర్ల నుంచే జరగాలనే చట్టాలను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. బ్యాంకులు, మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు ఇప్పటికే ఇటువంటి నిబంధనలు వర్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశంలోని ప్రధాన నగరాలు, ముఖ్యంగా తీరప్రాంతాల్లో డేటా సెంటర్లు వేగంగా విస్తరిస్తున్నాయి. 

విధానపరమైన ప్రోత్సాహకాలు, విద్యుత్, నీటి లభ్యత వంటి కారణాలతో హైదరాబాద్ వంటి నగరాలు పెద్ద ప్రాజెక్టులను ఆకర్షిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏఐ రంగంలో ఆధిపత్యం కోసం ట్రిలియన్ల డాలర్లతో పోటీ నెలకొన్న తరుణంలో, ఈ పెట్టుబడుల వెల్లువ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో తన స్థానాన్ని సుస్థిరపరుచుకోవడానికి భారత్‌కు ఎంతగానో దోహదపడనుంది. అయితే, దీర్ఘకాలంలో భూమి, విద్యుత్, నీటి లభ్యత వంటి సవాళ్లు కీలకంగా మారనున్నాయి.


India Tech Investment
Microsoft
Amazon
Google
Meta
AI
Data Centers India
Digital Economy India
Foreign Investment India
New York Times

More Telugu News