Anitha: 'రప్పా రప్పా నరుకుతాం' అంటే.. రఫ్ఫాడిస్తాం: వైసీపీ శ్రేణులకు అనిత వార్నింగ్
- ప్రపంచంలో ఎక్కడైనా పుట్టినరోజు కేకులను వేటకొడవళ్లు, తల్వార్లతో కట్ చేస్తారా? అని ప్రశ్నించిన అనిత
- జగన్ ఆదేశాల మేరకే జంతు బలులు జరిగాయని ఆరోపణ
- టీనేజ్ పిల్లలను ఉన్మాదులుగా చేసే ప్రయత్నం జరుగుతోందని మండిపాటు
- తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలని సూచన
రాజకీయ ముసుగులో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్మాదపు చర్యలుకు దిగుతున్నారంటూ రాష్ట్ర హోం మంత్రి అనిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పుట్టినరోజు వేడుకల పేరుతో సమాజంలో హానికరమైన సంప్రదాయాలను ప్రోత్సహించడం గర్హనీయమని ఆమె పేర్కొన్నారు. వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు వేళ కార్యకర్తలు జగన్ ఫ్లెక్సీ వద్ద మేకను బలివ్వడంపై ఆమె మండిపడ్డారు.
నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సాధారణంగా పుట్టినరోజు అంటే అన్నదానం చేయడం, రోగులకు పళ్ళు, రొట్టెలు పంచడం, రక్తదానం చేయడం లేదా గుడిలో పూజలు నిర్వహించడం వంటి సేవా కార్యక్రమాలు చేస్తారు. కానీ వైసీపీ నాయకులు దీనికి భిన్నంగా రౌడీయిజానికి బలాన్ని ఇచ్చేలా ప్రవర్తిస్తున్నారు. కేక్ కట్ చేయడానికి చిన్న ప్లాస్టిక్ కత్తి వాడటం మన సంప్రదాయం. కానీ వైసీపీ శ్రేణులు కొడవళ్ళు, వేటకొడవళ్ళు, పెద్ద పెద్ద కత్తులతో కేక్ కట్ చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
"రప్పా రప్పామని నరుకుతాం.. 2029లో ఇదే రిపీట్ అవుతుంది" అంటూ నినాదాలు చేయడం వారి నేరపూరిత ఆలోచనలకు అద్దం పడుతోందని అన్నారు. వేడుకల పేరుతో ఇష్టానుసారంగా టపాసులు కాల్చుతుంటే, ఇబ్బంది కలిగి పక్కకు వెళ్లమని కోరిన ఒక గర్భిణీ స్త్రీని కడుపుపై కాలితో తన్నడం వారి ఉన్మాదానికి పరాకాష్ఠ అని దుయ్యబట్టారు.
కళ్యాణదుర్గం, ఉరవకొండ, సింగనమల, రాప్తాడు, కుప్పం వంటి 10కి పైగా నియోజకవర్గాల్లో ఒకే రోజు, ఒకే తరహాలో జంతు బలులు, రక్తాభిషేకాలు జరిగాయంటే.. ఇది జగన్ ఆదేశాల మేరకు జరిగిన వ్యవస్థీకృత నేరమేనని స్పష్టమవుతోందని ఆరోపించారు. మాజీ మంత్రులు పక్కనే ఉండి ప్రోత్సహిస్తుంటే, కార్యకర్తలు మేకల తలలు నరికి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు.
రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా వైసీపీ నేతలు రోజురోజుకు మరింత దిగజారుతున్నారని విమర్శించారు. టీనేజ్ పిల్లలను రెచ్చగొట్టి, సైకోలు, ఉన్మాదుల్లా మార్చే ప్రయత్నం జరుగుతోందని, ఇది చాలా ప్రమాదకర ధోరణి అని హెచ్చరించారు. కనీసం పిల్లల తల్లిదండ్రులైనా తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచించారు.
వైసీపీ శ్రేణులు ఎలాంటి తప్పులు చేసినా ఆ పార్టీ నాయకుడు జగన్ నోరు తెరిచి వాటిని ఖండించడం లేదని అనిత తీవ్రంగా తప్పుబట్టారు. ఆస్తి కోసం సొంత తల్లి, చెల్లెలిపై కేసులు పెట్టిన వ్యక్తి మీ పిల్లలను రక్షిస్తాడా? అని ప్రశ్నించారు. తమ పార్టీ నేతల తప్పులను తప్పుగా చెప్పే నైతిక ధైర్యం జగన్‌కు లేదా? అని నిలదీశారు. రాష్ట్ర శాంతి భద్రతలకు భంగం కలిగించే ఇలాంటి చర్యలను ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు.
"ఇక్కడ అధికారంలో ఉన్నది చంద్రబాబు గారు. శాంతిభద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. రోడ్ల మీద కత్తులు, కొడవళ్లు పట్టుకుని "రప్పా రప్పా నరుకుతాం" అని తిరిగే ఉన్మాదులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం. ఫ్లెక్సీలపై రక్తాభిషేకాలు చేసిన ప్రతి ఒక్కరి జాతకం మా దగ్గర ఉంది. గతంలోలాగా ముసుగులేసి దాచడం కాదు.. ప్రతి నేరస్థుడిని రోడ్డు మీద నిలబెట్టి ప్రజలకు చూపిస్తాం.
రౌడీయిజం చేస్తామంటే మా డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉంది. ఇప్పటికే రౌడీ షీటర్లను రోడ్ల మీద నడిపిస్తున్నాం. పరిస్థితి విషమిస్తే, అరాచక శక్తులను రాష్ట్ర బహిష్కరణ చేయడానికి కూడా వెనుకాడం. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మీ బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని మేము 'స్కిల్ డెవలప్మెంట్' సెంటర్లు పెడుతుంటే, జగన్ వారి చేతికి కత్తులు ఇస్తున్నారు. రప్పా రప్పా అని గీత దాటితే కటకటాలు తప్పవు" అని హెచ్చరించారు.