Rahul Gandhi: జనవరి 5 నుంచి 'ఎంజీనరేగా బచావో అభియాన్' నిరసనలు: రాహుల్ గాంధీ

Rahul Gandhi Announces MGNREGA Bachao Abhiyan Protests
  • ఉపాధి హామీ పథకం రద్దు పేద ప్రజలపై దాడి అని అభివర్ణించిన రాహుల్ గాంధీ
  • ఉపాధి హామీ పేదల పని హక్కు అని ఉద్ఘాటన
  • కేంద్రం ఏకపక్ష నిర్ణయాలపై కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుందని వ్యాఖ్య
ఉపాధి హామీ పథకం రద్దు పేద ప్రజలపై దాడి అని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. ఉపాధి హామీ పథకం రద్దుకు వ్యతిరేకంగా జనవరి 5 నుంచి 'ఎంజీనరేగా బచావో అభియాన్' పేరుతో దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.

ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి దాని స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావడాన్ని తప్పుబట్టారు. ఉపాధి హామీ కేవలం పథకం కాదని, పేదల పని హక్కు అని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత మంత్రులను సంప్రదించకుండానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంతగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. మన దేశంలో పాలన వన్ మ్యాన్ షోగా మారిపోయిందని విమర్శించారు. నరేంద్ర మోదీ ఏది కోరుకుంటే దేశంలో అదే అమలవుతోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ చర్యలకు వ్యతిరేకంగా పోరాడటానికి ముందుకు రావాలని ప్రతిపక్ష నాయకులకు పిలుపునిచ్చారు.

ఉపాధి హామీ ప్రపంచ ప్రఖ్యాతి పొందిన పథకమని, దీనిని ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని, ఇప్పుడు గ్రామీణ పేదలకు కూడా ఉపాధి లేకుండా చేశారని ధ్వజమెత్తారు. ఏళ్ళుగా పేదలకు ఆర్థిక భరోసాను ఇచ్చిన, అన్నం పెట్టిన ఈ పథకాన్ని రద్దు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కేంద్రం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుందని అన్నారు.
Rahul Gandhi
MGNREGA Bachao Abhiyan
NREGA
employment guarantee scheme
Indian National Congress

More Telugu News