Bandi Sanjay: డ్రగ్స్ కేసులో సెలబ్రిటీల పేర్లు బయటకొచ్చాయి... 2017లోని ఆధారాలు ఏమయ్యాయి?: బండి సంజయ్ ప్రశ్న

Bandi Sanjay Questions Telangana Govt on Drugs Case Probe
  • నూతన సంవత్సరం, పండుగ సమయంలో మాత్రమే డ్రగ్స్ కేసులు నమోదు చేస్తారా అని ప్రశ్న
  • డ్రగ్స్ నిర్మూలనకు అకుల్ సబర్వాల్ వంటి అధికారి అవసరమన్న బండి సంజయ్
  • 2017 కేసు నాటి ఆధారాలను సోమేశ్ కుమార్ స్వాధీనం చేసుకున్నారని ఆరోపణ
డ్రగ్స్ కేసుల నేపథ్యంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పండుగల సమయంలో మాత్రమే డ్రగ్స్ కేసులు నమోదు చేస్తారా? అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో డ్రగ్స్ కేసు విచారణ ఎంతవరకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఈ కేసుపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు 'ఎక్స్' వేదికగా ఆయన డ్రగ్స్ కేసులపై స్పందించారు.

2017 నాటి కేసు దర్యాప్తులో సినిమా ప్రముఖులు, మరికొందరు ప్రముఖుల పేర్లు వినవచ్చాయని ఆయన గుర్తు చేశారు. నాడు వారిని విచారించినప్పుడు కేసీఆర్ కుటుంబ సభ్యుల పేర్లు కూడా వినవచ్చాయని అన్నారు. ఇందుకు సంబంధించి ఆడియో, వీడియో ఆధారాలు ఉన్నాయని గుర్తు చేశారు. అయితే వాస్తవాలు బహిర్గతం కాకుండా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్... అకున్ సబర్వాల్‌ను హఠాత్తుగా బదిలీ చేసి కేసును నీరుగార్చారని ఆరోపించారు. ఈ ఆధారాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. వాటిని కోర్టు ముందు ఎందుకు ప్రవేశపెట్టలేదని నిలదీశారు.

ఆధారాలను, వీడియో, ఆడియో స్టేట్‌మెంట్ రికార్డులను నాటి సీఎస్ సోమేశ్ కుమార్ స్వాధీనం చేసుకున్నారని, ఆయనను అదుపులోకి తీసుకుని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. అప్పుడే ఈ డ్రగ్స్ కేసు వెనుక ఉన్న నిజాలు వెలుగు చూస్తాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నూతన సంవత్సరం, పండుగల సమయంలో మాత్రమే డ్రగ్స్ గుర్తుకు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. జీరో డ్రగ్స్ విధానం ఇదేనా అని ప్రశ్నించారు.

సమర్థులైన అధికారులు ఉన్నప్పటికీ, కొంతమంది లంచాలకు మరిగి డ్రగ్స్ వ్యాపారులతో రాజీపడ్డారనే విశ్వసనీయ సమాచారం ఉందని బండి సంజయ్ పేర్కొన్నారు. డ్రగ్స్‌ను నిర్మూలించాలనుకుంటే అకున్ సబర్వాల్ లాంటి సమర్థులైన అధికారులకు దర్యాప్తును అప్పగించాలని డిమాండ్ చేశారు. ఎప్పుడో ఒకసారి చర్యలు తీసుకున్నంత మాత్రాన, తీసుకుంటామని చెప్పినంత మాత్రాన డ్రగ్స్ నిర్మూలన జరగదని అన్నారు. డ్రగ్స్ కేసులో పారదర్శక, వేగవంతమైన విచారణను డిమాండ్ చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
Bandi Sanjay
Telangana drugs case
Akun Sabharwal
KCR family
Somes Kumar
drug investigation

More Telugu News