Mahbub Ali Zaki: బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో విషాదం... మ్యాచ్ కు ముందు అసిస్టెంట్ కోచ్ హఠాన్మరణం

Mahbub Ali Zaki Assistant Coach Dies Before BPL Match
  • మ్యాచ్‌కు ముందు గ్రౌండ్‌లో కుప్పకూలిన ఢాకా క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్
  • ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యుల నిర్ధారణ
  • మహబూబ్ అలీ జకీ మృతిపై బంగ్లాదేశ్ బోర్డు సంతాపం
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఢాకా క్యాపిటల్స్ జట్టు అసిస్టెంట్ కోచ్ మహబూబ్ అలీ జకీ (59) హఠాన్మరణం చెందాడు. ఇవాళ సిల్హెట్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాజ్‍షాహీ వారియర్స్‌తో మ్యాచ్ ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు ఈ దురదృష్టకర ఘటన జరిగింది.

వివరాల్లోకి వెళితే, మ్యాచ్‌కు ముందు జట్టు ప్రాక్టీస్ చేస్తుండగా, జకీ మైదానంలో అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన జట్టు సిబ్బంది, వైద్యులు అతడికి సీపీఆర్ (CPR) చేసి, అంబులెన్స్‌లో సమీపంలోని అల్ హరమైన్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే మహబూబ్ అలీ జకీ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. 

ఈ ఘటనతో మైదానంలో ఉన్నవారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. జకీకి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, అతడడి ఆకస్మిక మరణం తమను తీవ్రంగా కలచివేసిందని జట్టు అధికారులు తెలిపారు.

జకీ మృతికి సంతాపంగా మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లు, అధికారులు ఒక నిమిషం మౌనం పాటించారు. అనంతరం మ్యాచ్ యథావిధిగా కొనసాగింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ఈ ఘటనపై తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. దేశ క్రికెట్‌కు, ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ల అభివృద్ధికి జకీ చేసిన సేవలు మరువలేనివని కొనియాడింది. ఒకప్పుడు ఫాస్ట్ బౌలర్‌గా రాణించిన జకీ, కొమిల్లా జిల్లాకు, దేశంలో ప్రముఖ క్లబ్ అయిన అబాహనీ లిమిటెడ్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
Mahbub Ali Zaki
Bangladesh Premier League
BPL
Dhaka Capitals
Cricket Coach Death
Rajshahi Warriors
Sylhet International Cricket Stadium
Bangladesh Cricket Board
BCB

More Telugu News