Jaggareddy: జగన్, కేసీఆర్ ఎప్పుడైనా చర్చలు జరిపారా?: జగ్గారెడ్డి

Jaggareddy Slams Jagan KCR Over Lack of State Issue Discussions
  • జగన్, కేసీఆర్ ఒకరింటికి మరొకరు వెళ్లి విందు భోజనాలు తిన్నారన్న జగ్గారెడ్డి
  • ఇరు రాష్ట్రాల సమస్యలపై ఏనాడైనా చర్చలు జరిపారా అని ప్రశ్న
  • వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై జగన్ ఎందుకు మాట్లాడటం లేదన్న జగ్గారెడ్డి

ఏపీ, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్‌పై తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. గతంలో కేసీఆర్ జగన్ ఇంటికి వచ్చి చేపలు తిన్నారని, జగన్ హైదరాబాద్‌లో కేసీఆర్ ఇంటికి వచ్చి కోడికూర తిన్నారని అన్నారు. అయితే, సీఎం రేవంత్ రెడ్డి ఇలా దిగజారి వ్యవహరించరని చెప్పారు. ఇరు రాష్ట్రాల సమస్యలపై గతంలో జగన్, కేసీఆర్ ఎప్పుడైనా చర్చలు జరిపారా? అని ప్రశ్నించారు. వారిని మీడియా ప్రతినిధులు ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు.


రెండు రాష్ట్రాలు బాగుండాలనేదే తన ఆకాంక్ష అని చెప్పారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను ఉన్నతస్థాయిలో చర్చించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నీటి ప్రాజెక్టులు, కేటాయింపుల వంటి అంశాలపై సీఎం‌లు ప్రత్యక్షంగా కూర్చుని చర్చించాలన్నారు.


“విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ప్రజల భాగస్వామ్యంతో ఉక్కు కర్మాగారం ఏర్పాటు అయ్యింది. 1970లో ఇందిరాగాంధీ పార్లమెంటులో ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. రూ.14,000 కోట్లు వ్యయం చేసి స్థాపించిన ఫ్యాక్టరీ వల్ల విశాఖపట్నం అభివృద్ధి చెందింది. వేలు, లక్షల కుటుంబాలు ఉక్కుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆనాటి ఉద్యమం కారణంగా ఎంతోమంది నాయకులుగా ఎదిగారు. వెంకయ్య నాయుడు కూడా ఉద్యమం ద్వారా జాతీయ స్థాయి నేతగా అవతరించారు” అని జగ్గారెడ్డి చెప్పారు.


“యూపీఏ ప్రభుత్వంలో నష్టాలను భర్తీ చేస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుతూ వచ్చారు. ఇప్పుడు మోదీ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత, ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్నట్లు కనిపిస్తుంది. రెండు లక్షల కోట్ల విలువ చేసే విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ కు కట్టపెట్టేలా కుట్రలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు జగన్ ఎందుకు మాట్లాడటం లేదు?” అని ప్రశ్నించారు.

Jaggareddy
Jagan
KCR
Telangana
Andhra Pradesh
YS Jagan Mohan Reddy
K Chandrashekar Rao
Vishakha Steel Plant
Revanth Reddy
AP Telangana issues

More Telugu News