Dharmana Krishna Das: దమ్ముంటే చంపాలి... ధర్మాన కృష్ణదాస్ కు దువ్వాడ శ్రీనివాస్ సవాల్

Dharmana Krishna Das Challenged by Duvvada Srinivas to Kill Him If He Dares
  • శ్రీకాకుళం రాజకీయాల్లో తారాస్థాయికి చేరిన దువ్వాడ, కృష్ణదాస్ వివాదం
  • తన హత్యకు కుట్ర జరుగుతోందంటూ దువ్వాడ శ్రీనివాస్ ఆరోపణ
  • అర్థరాత్రి హైవేపైకి వచ్చి దమ్ముంటే చంపాలంటూ సవాల్
  • ఆరోపణలను ఖండించిన మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్
శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వైసీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, ఆ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన దువ్వాడ శ్రీనివాస్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. మాటల యుద్ధం కాస్తా హత్యలకు కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపణలు, ప్రతి సవాళ్ల వరకు వెళ్లింది. ఏకంగా అర్థరాత్రి హైవేపైకి వచ్చి దువ్వాడ శ్రీనివాస్ చేసిన హడావుడి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

వివరాల్లోకి వెళితే, తనను హత్య చేసేందుకు ధర్మాన కృష్ణదాస్ వర్గం కుట్ర పన్నుతోందని దువ్వాడ శ్రీనివాస్‌కు సమాచారం అందింది. కృష్ణదాస్‌కు సన్నిహితుడైన అప్పన్న అనే వ్యక్తి, దివ్వెల మాధురికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పినట్టు తెలిసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన దువ్వాడ, హైదరాబాద్ నుంచి నేరుగా శ్రీకాకుళం వచ్చి శుక్రవారం అర్థరాత్రి జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. తన హత్యకు స్కెచ్ వేసింది నిజమే అయితే, దమ్ముంటే ఇక్కడికే వచ్చి తనను చంపాలంటూ సవాల్ విసిరారు. ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ధర్మాన సోదరులు తనపై కక్షగట్టి పార్టీ నుంచి సస్పెండ్ చేయించారని దువ్వాడ ఆరోపించారు. తనను పూర్తిగా పార్టీ నుంచి బహిష్కరిస్తే, జిల్లాలో ఒక వర్గాన్ని అణచివేస్తున్న వారిపై మరింత స్వేచ్ఛగా పోరాడతానని అన్నారు.

ఈ ఆరోపణలపై ధర్మాన కృష్ణదాస్ స్పందించారు. దువ్వాడ శ్రీనివాస్‌పై తనకెందుకు కక్ష ఉంటుందని ప్రశ్నించారు. అనవసర ఆరోపణలు చేస్తూ ఆయనే నవ్వులపాలవుతున్నారని విమర్శించారు. కింజరాపు అప్పన్నతో తాను మాట్లాడింది నిజమే అయినా, దువ్వాడపై తనకు ఎలాంటి కోపం లేదని కృష్ణదాస్ స్పష్టం చేశారు. 
Dharmana Krishna Das
Duvvada Srinivas
Srikakulam
YSRCP
Andhra Pradesh Politics
Political Rivalry
Assassination Plot
Kinjarapu Appanna
Divvela Madhuri
Political Suspension

More Telugu News