Jagan: జగన్ ఫ్లెక్సీకి మళ్లీ జంతుబలి.. ఏడుగురిని అరెస్ట్ చేసి విచారిస్తున్న పోలీసులు
- మేకపోతును బలి ఇచ్చి.. ఫ్లెక్సీకి రక్తాభిషేకం చేసిన వైసీపీ శ్రేణులు
- చోడవరం గ్రామంలో ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- దీని వెనుక ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయనే కోణంలో విచారణ
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. వైసీపీ శ్రేణులు హద్దులు దాటి వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీసింది. నిన్న రాత్రి వైసీపీ అధినేత జగన్ ఫ్లెక్సీ ముందు మేకపోతును బలి ఇచ్చి, ఆ రక్తంతో ఫ్లెక్సీకి అభిషేకం చేయడం తీవ్ర సంచలనంగా మారింది. ‘2029 గంగమ్మ జాతర రప్పారప్పా’ అంటూ వీరు నినాదాలు చేశారు. అంతేకాదు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం మరింత వివాదాస్పదమైంది. ఈ వీడియోలు వైరల్ కావడంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి.
విషయం తీవ్రతరమవడంతో ఈ ఉదయం తూర్పుగోదావరి పోలీసులు చోడవరం గ్రామానికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించి ఏడుగురు వైసీపీ నేతలను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వీడియోలు చిత్రీకరించిన వారు ఎవరు? వెనుక ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయి? అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. యువత ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని, రాజకీయాల పేరుతో తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. మరోవైపు, వీరిపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఇటీవల జగన్ పుట్టినరోజు సందర్భంగా కూడా పలు చోట్ల జగన్ ఫ్లెక్సీల ముందు వైసీపీ శ్రేణులు జంతు బలులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి అనేక చోట్ల వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి.