AP: మన్యం జిల్లాలో అమానవీయ ఘటన.. చెత్త బండిపై వృద్ధురాలి మృతదేహం తరలింపు

Corpse of elderly woman transported on Garbage Ricshaw In Manyam District
  • ప్రభుత్వాసుపత్రిలో అంబులెన్స్ లేక తీవ్ర అవస్థలు
  • చెత్త తరలించే రిక్షాపై వృద్ధురాలి మృతదేహం తరలింపు
  • ప్రైవేటు వాహనానికి డబ్బుల్లేక బంధువుల నిస్సహాయత‌
ఏపీలోని మన్యం జిల్లాలో అత్యంత దారుణమైన, అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ నిరుపేద వృద్ధురాలి మృతదేహాన్ని తరలించేందుకు ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో బంధువులు చెత్త తరలించే రిక్షాపై శ్మశానానికి తీసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ హృదయవిదారక సంఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళితే.. మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామానికి చెందిన రాధమ్మ (65) భర్త, కుమార్తె చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తున్నారు. ఇటీవల ఆమె అనారోగ్యానికి గురవడంతో బంధువులు భద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఆమె మృతిచెందారు.

మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లేందుకు ఆసుపత్రిలో అంబులెన్స్ కోసం ప్రయత్నించగా, అది అందుబాటులో లేదని సిబ్బంది తెలిపారు. ప్రైవేటు వాహనాన్ని సంప్రదిస్తే వారు రూ. 2,500 డిమాండ్ చేశారు. అంత మొత్తం చెల్లించే స్తోమత లేకపోవడంతో నిస్సహాయ స్థితిలో వారు చెత్త సేకరించే రిక్షాలోనే మృతదేహాన్ని ఇంటికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
AP
Manyam District
Radhamma
Gummalaaxmipuram
ambulance service
poverty
government hospital
negligence
viral video

More Telugu News