Virat Kohli: కింగ్ కోహ్లీ పెద్ద మనసు.. తన వికెట్ తీసిన బౌలర్‌కు వెలకట్టలేని బహుమతి!

Virat Kohlis Kind Gesture to Bowler After Losing Wicket
  • తన వికెట్ తీసిన గుజరాత్ స్పిన్నర్ విశాల్ జైస్వాల్‌ను అభినందించిన కోహ్లీ
  • తనను ఔట్ చేసిన బంతిపై సంతకం చేసి బహుమతిగా ఇచ్చిన స్టార్ బ్యాటర్
  • ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీకి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు
మైదానంలో విరాట్ కోహ్లీ దూకుడుగా కనిపిస్తాడు కానీ, ఆట ముగిశాక అతడు కనబరిచే క్రీడా స్ఫూర్తి అద్భుతంగా ఉంటుంది. తాజాగా విజయ్ హజారే ట్రోఫీలో గుజరాత్ స్పిన్నర్ విశాల్ జైస్వాల్ విషయంలో కోహ్లీ ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరుసగా రెండో సెంచరీ చేసేలా కనిపించిన కోహ్లీని.. ఈ యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అవుట్ చేసి షాక్ ఇచ్చాడు. అయితే, అవుట్ అయినందుకు నిరాశ చెందకుండా, ఆ కుర్రాడి ప్రతిభను కోహ్లీ అభినందించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.

గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 77 పరుగుల వద్ద విశాల్ జైస్వాల్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ నేరుగా ఆ యువ బౌలర్ వద్దకు వెళ్లి మాట్లాడాడు. అంతేకాకుండా, తను అవుట్ అయిన బంతిపై ఆటోగ్రాఫ్ ఇచ్చి విశాల్‌కు బహుమతిగా అందించాడు. టివీల్లో చూసే తన ఆరాధ్య దైవం తన వికెట్ తీశాక ఇలా అభినందించడంతో విశాల్ జైస్వాల్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. "ప్రపంచ క్రికెట్‌ను శాసించే విరాట్ భాయ్ వికెట్ తీయడం నా జీవితంలో మర్చిపోలేని మధుర జ్ఞాపకం" అంటూ విశాల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఉద్వేగభరిత పోస్ట్ పెట్టాడు.

ఢిల్లీకి ఉత్కంఠ విజయం
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 50 ఓవర్లలో 254 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (77), రిషబ్ పంత్ (70) కీలక ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం లక్ష్య ఛేదనలో గుజరాత్ జట్టు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, చివరికి 247 పరుగుల వద్ద ఆలౌటైంది. దీంతో ఢిల్లీ 7 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీకి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. 
Virat Kohli
Virat Kohli wicket
Vishal Jaiswal
Vijay Hazare Trophy
Delhi cricket
Gujarat cricket
Rishabh Pant
Cricket news
Cricket

More Telugu News