Narayana: మంత్రి నారాయణ కార్యక్రమంలో రైతు గుండెపోటుతో మృతి

Farmer Dies of Heart Attack at Minister Narayana Meeting
  • అమరావతి మండలం మందడం గ్రామంలో విషాదం
  • ఇళ్లు, భూములు కోల్పోతున్న నిర్వాసితుల సమస్యలపై మంత్రి నారాయణ సమావేశం
  • తన ఆవేదనను మంత్రి ఎదుట వినిపించిన రాములు అనే రైతు
  • అనంతరం కుర్చీలో కుప్పకూలిన వైనం
  • ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మృతి
గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అమరావతి ప్రాంతంలోని మందడం గ్రామంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఓ రైతు గుండెపోటుతో మృతి చెందాడు. రోడ్డు నిర్మాణ పనుల కోసం ఇళ్లు, భూములు కోల్పోతున్న నిర్వాసితుల సమస్యలపై చర్చిస్తుండగా ఈ దురదృష్టకర ఘటన జరిగింది. మృతుడిని ఎం. రాములు (68)గా గుర్తించారు.

వివరాల్లోకి వెళితే, రాజధాని ప్రాంతంలో రోడ్డు నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న రైతులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతు రాములు తన ఆవేదనను మంత్రి ముందు వెళ్లగక్కారు. ముక్కలు ముక్కలుగా ప్లాట్లు కేటాయించి తమ గొంతు కోస్తున్నారని వాపోయారు. గతంలో మంత్రి చెప్పడం వల్లే తమకు వాగు సమీపంలో ప్లాట్లు ఇచ్చారని ఆరోపించారు. తాను రోడ్డు కోసం ఇల్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని, అయితే ఇళ్లు కోల్పోయే తమ అందరికీ తాళ్లయపాలెం సమీపంలో సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన ఒకేచోట స్థలాలు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.

మంత్రి ఎదుట తన గోడును వెళ్లబోసుకున్న కొద్దిసేపటికే రాములు కూర్చున్న కుర్చీలోనే కుప్పకూలిపోయాడు. అక్కడున్న అధికారులు, ఇతర రైతులు వెంటనే స్పందించి సీపీఆర్ చేశారు. హుటాహుటిన మంత్రి కాన్వాయ్‌లోని వాహనంలోనే మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆలస్యమైంది. మార్గమధ్యంలోనే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనతో మందడం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలోనే రైతు మృతి చెందడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
Narayana
Minister Narayana
Andhra Pradesh
Guntur
Mandadam
Farmer Death
Heart Attack
Road Construction
Land Acquisition
Amaravati

More Telugu News