Heo Hwang-ok: అయోధ్యలో కొరియా రాణి విగ్రహం... కారణం ఇదే...!

Heo Hwang ok Statue Unveiled in Ayodhya Highlighting Korean Connection
  • అయోధ్యలో కొరియా రాణి సురి రత్న కాంస్య విగ్రహం ఆవిష్కరణ
  • 2000 ఏళ్ల క్రితం అయోధ్య నుంచి కొరియా వెళ్లిన యువరాణి కథ
  • సరయూ నది ఒడ్డున రాణి గౌరవార్థం స్మారక పార్కు నిర్మాణం
  • తమ పూర్వీకులు అయోధ్య వారని నమ్మే 60 లక్షల మంది కొరియన్లు
  • భారత్, దక్షిణ కొరియా మధ్య సాంస్కృతిక బంధానికి నిదర్శనం
భారత్, దక్షిణ కొరియాల మధ్య ఉన్న పురాతన సాంస్కృతిక బంధానికి ప్రతీకగా అయోధ్యలో కీలక పరిణామం చోటుచేసుకుంది. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో, కొరియా రాణి హెయో హ్వాంగ్-ఓక్ (సురిరత్న) కాంస్య విగ్రహాన్ని ఇటీవల ఆవిష్కరించారు. సుమారు 2000 ఏళ్ల క్రితం అయోధ్యకు చెందిన యువరాణి కొరియాకు వెళ్లి అక్కడి రాజును వివాహమాడారనే చారిత్రక విశ్వాసానికి గుర్తుగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

ఎవరీ సురి రత్న?

కొరియన్ ఇతిహాసాల ప్రకారం, క్రీ.శ. 48లో అయోధ్య రాజు తన కుమార్తె సురి రత్నను, దైవాజ్ఞ మేరకు సముద్ర మార్గంలో కొరియాకు పంపారు. అక్కడ ఆమె గయ సామ్రాజ్య స్థాపకుడైన రాజు కిమ్ సురోను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు పది మంది సంతానం కలగగా, వారి వారసులనే నేడు దక్షిణ కొరియాలో 'కరక్' తెగగా పిలుస్తారు. సుమారు 60 లక్షల మంది ఉన్న ఈ తెగ ప్రజలు, తమ మూలాలు అయోధ్యలోనే ఉన్నాయని దృఢంగా విశ్వసిస్తారు.

సరయూ తీరాన స్మారక చిహ్నం

ఈ చారిత్రక అనుబంధాన్ని గౌరవిస్తూ 2001లోనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, దక్షిణ కొరియాలోని గిమ్హే నగరం కలిసి సరయూ నది ఒడ్డున రాణి సురి రత్న పేరుతో ఒక స్మారక పార్కును నిర్మించాయి. కొరియా ప్రతినిధుల కోరిక మేరకు ఇటీవల ఈ పార్కును మరింత సుందరీకరించి, తాజాగా రాణి కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించారు. 2018లో దక్షిణ కొరియా ప్రథమ మహిళ కిమ్ జంగ్-సూక్ భారత పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి ఈ పార్కు అభివృద్ధి పనులను ప్రారంభించడం గమనార్హం.

ప్రతి ఏటా కరక్ తెగకు చెందిన వందలాది మంది కొరియన్లు అయోధ్యకు వచ్చి తమ పూర్వీకురాలిని స్మరించుకుంటారు. ఈ విగ్రహ ఏర్పాటుతో అయోధ్య, గిమ్హే నగరాల మధ్య ఉన్న 'సోదర' బంధం మరింత బలపడింది. ఈ పరిణామం రెండు దేశాల మధ్య కేవలం దౌత్యపరమైన సంబంధాలకే కాకుండా, చారిత్రక, సాంస్కృతిక బంధానికి నిలువుటద్దంగా నిలుస్తోంది.
Heo Hwang-ok
Queen Heo Hwang-ok
Suriratna
Ayodhya
South Korea
India
Kim Suro
Karak clan
Gimhae
Uttar Pradesh

More Telugu News