Ara Mastan: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరా మస్తాన్ ను మళ్లీ విచారించిన సిట్
- రెండున్నర గంటల పాటు కొనసాగిన విచారణ
- తనకు తెలిసిన అన్ని విషయాలు స్పష్టంగా చెప్పానన్న మస్తాన్
- తన ఫోన్ డేటాను అధికారులు తన ముందు ఉంచారని వెల్లడి
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక సాక్షిగా ఉన్న ఆరా మస్తాన్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరోసారి విచారించింది. సుమారు రెండున్నర గంటల పాటు సాగిన ఈ విచారణలో సిట్ అధికారులు మస్తాన్ రెండో స్టేట్‌మెంట్‌ను నమోదు చేశారు. దీంతో కేసు దర్యాప్తు తుది దశకు చేరుకుంటోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆరా మస్తాన్.. గతంలో తాను వెల్లడించిన అంశాలనే సిట్ అధికారులు మరోసారి స్పష్టంగా అడిగారని తెలిపారు. తనకు తెలిసిన ప్రతీ విషయం ఎలాంటి మార్పులు లేకుండా స్పష్టంగా చెప్పానన్నారు. ముఖ్యంగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌రావు ఇచ్చిన వాంగ్మూలాన్ని క్రాస్ చెక్ చేసుకునేందుకే తనను మరోసారి పిలిపించినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా సిట్ అధికారులు తన ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన డేటాను తన ముందే ఉంచారని మస్తాన్ చెప్పారు. ఆ డేటా ప్రకారం 2020 నుంచే తన రెండు ఫోన్లు ట్యాప్ అయ్యాయని అధికారులు వివరించినట్లు తెలిపారు. దీనితో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంత లోతుగా, పద్ధతిగా జరిగిందన్న విషయం స్పష్టమవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇక ఈ కేసులో సిట్ ఉన్నత స్థాయి అధికారులతో దర్యాప్తు చేపడుతోందని, ముఖ్యమైన సాక్షులందరినీ విచారిస్తున్నట్లు మస్తాన్ తెలిపారు. అందువల్లే దర్యాప్తు ముగింపు దశకు చేరుకుందని ఆయన అభిప్రాయపడ్డారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలిచే అవకాశముందని, వారం రోజుల్లో మళ్లీ నోటీసులు రావచ్చని కూడా సూచించారు.
మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసు త్వరలోనే ఒక తుది నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరా మస్తాన్ వ్యాఖ్యానించారు.