Telangana Government: రైతు భరోసా నిలిపివేస్తారనే ప్రచారంపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Government Responds to Rythu Bharosa Halt Rumors
  • సామాజిక మాధ్యమాల వేదికగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన ప్రభుత్వం
  • ఇలాంటి ప్రచారం దురుద్దేశంతో కూడుకున్నదని ఫ్యాక్ట్ చెక్ విభాగం పోస్టు
  • వాణిజ్య వినియోగంలో ఉన్న భూముల గురించే శాటిలైట్ మ్యాపింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడి
తెలంగాణలో రైతు భరోసా పథకాన్ని నిలిపివేస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను ఖండిస్తూ, ఇదంతా అవాస్తవమని తేల్చి చెప్పింది. రైతు భరోసా నిలిపివేత వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలంగాణ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ విభాగం 'ఎక్స్' ద్వారా స్పష్టం చేసింది. ఈ వార్తలు నిరాధారమైనవని, దురుద్దేశంతో కూడుకున్నవని పేర్కొంది.

రాష్ట్రంలో రైతు భరోసా కింద 65 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారని, అలాంటి పథకాన్ని నిలిపివేయడం జరగదని ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టం చేసింది. ప్రస్తుతం జరుగుతున్న వెరిఫికేషన్‌పై కూడా వివరణ ఇచ్చింది. నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందేలా చూసేందుకు సంబంధిత జిల్లా కమిటీలు క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్‌ నిర్వహిస్తున్నాయని తెలిపింది.

లబ్ధిదారులకు చెల్లింపులు జరిపేందుకు ఆర్థిక శాఖ జాబితాను సిద్ధం చేసి తనిఖీలు చేస్తోంది. కాబట్టి రైతు భరోసాను నిలిపివేస్తున్నారనే ప్రచారం పూర్తిగా తప్పుదోవ పట్టించేదిగా ఉందని ప్రభుత్వం తెలిపింది.

వాణిజ్య వినియోగంలో ఉన్న భూములకు రైతు భరోసా ప్రయోజనాలు పొందుతున్న వారిని గుర్తించి, వారిని జాబితా నుంచి తొలగించేందుకు ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం జర్మన్ సాంకేతిక పరిజ్ఞానంతో శాటిలైట్ మ్యాపింగ్ నిర్వహిస్తోంది. 2024లో చేపట్టిన సర్వే ప్రకారం సుమారు నాలుగు లక్షల ఎకరాల భూమి వాణిజ్య అవసరాల కోసం వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా ఇది హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు.

ఈ మ్యాపింగ్ ప్రక్రియ ద్వారా ప్రతి లబ్ధిదారుడికి ఎంత భూమి సాగులో ఉందో నిర్ధారించవచ్చు. రైతు భరోసా పొందుతున్న భూమి సాగులో ఉందా లేదా రియల్ ఎస్టేట్ వెంచరుగా మార్చబడిందా అనే విషయాలను తెలుసుకోవచ్చు. గత సంవత్సరం రైతు భరోసా కింద దాదాపు రూ.8,500 కోట్ల నుంచి రూ.9 వేల కోట్ల వరకు రైతుల ఖాతాల్లో జమ చేశామని ప్రభుత్వం తెలిపింది.

రైతు భరోసా విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి షరతులు విధించలేదని స్పష్టం చేసింది. పంట పండించే ప్రతి రైతు 'రైతు భరోసా'కు అర్హుడేనని తెలిపింది. ఒకవేళ జాబితా నుంచి పేర్లు తొలగించినా, అభ్యంతరాలు ఉన్నా రైతులు జిల్లా కలెక్టర్ లేదా జిల్లా స్థాయి రెవెన్యూ అధికారులను సంప్రదించవచ్చని సూచించింది.
Telangana Government
Rythu Bandhu
Rythu Bharosa
Telangana Rythu Bharosa
Farmers Welfare Scheme

More Telugu News