KCR: కీలక నేతలతో భేటీ అయిన కేసీఆర్.. వేడెక్కుతున్న తెలంగాణ రాజకీయం
- ఫామ్ హౌస్ లో కేటీఆర్, హరీశ్ తదితరులతో కేసీఆర్ భేటీ
- అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
- ఫోన్ ట్యాంపింగ్ అంశంపై కూడా చర్చ జరిగినట్టు సమాచారం
తెలంగాణలో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ యాక్టివ్ మోడ్‌లోకి వెళ్లారు. వరుస సమావేశాలు, నేతలతో మంతనాలు, వ్యూహాత్మక నిర్ణయాలతో ఆయన రాజకీయాల్లో దూకుడు పెంచుతున్నారు. ముఖ్యంగా శాసనసభ సమావేశాలు సమీపిస్తున్న వేళ, పార్టీని మళ్లీ పోరాటానికి సిద్ధం చేసే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ ఈరోజు కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ముఖ్య నేతలు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ తరఫున అనుసరించాల్సిన వ్యూహం, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ఎలా ఎదురుదాడి చేయాలన్న అంశాలపై కేసీఆర్ స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.
అలాగే రానున్న రోజుల్లో నిర్వహించాల్సిన బహిరంగ సభలు, నియోజకవర్గ స్థాయి కార్యక్రమాల తేదీలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పార్టీ శ్రేణులు ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని కేసీఆర్ నేతలకు సూచించినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, ఇదే సమయంలో మరో కీలక పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయాలన్న దిశగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసును తుది దశకు తీసుకెళ్లాలంటే కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీశ్ రావును కూడా విచారించాల్సిన అవసరం ఉందని సిట్ భావిస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే కేసీఆర్, హరీశ్ రావులకు త్వరలో సమన్లు జారీ చేసి విచారణ చేపట్టాలని సిట్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే శాసనసభ సమావేశాల సమయంలో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, సమావేశాలు ముగిసిన తర్వాత నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు టాక్ నడుస్తోంది.
ఈ మొత్తం పరిణామాల మధ్య కేసీఆర్ రాజకీయంగా వేగం పెంచడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు ప్రభుత్వంపై దాడికి సిద్ధమవుతూ, మరోవైపు న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొనే వ్యూహంతో ఆయన ముందుకు సాగుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారనున్నాయన్న సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి.