Prasanna Kumar: ఫిలిం ఛాంబర్ ఎన్నికలు... పెద్ద నిర్మాతలు Vs. చిన్న నిర్మాతలు
- ఇండస్ట్రీ మొత్తం ఒక్కరి చేతిలోనే ఉందన్న ప్రసన్న కుమార్
- చిన్న సినిమాలకు థియేటర్లు కూడా ఇవ్వడం లేదని మండిపాటు
- ఇది చిన్న నిర్మాతల మనుగడకు సంబంధించిన అంశమని వెల్లడి
తెలుగు చిత్ర పరిశ్రమలో కీలకమైన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. ఈసారి ఎన్నికలు కేవలం పదవుల కోసం కాకుండా... పెద్ద నిర్మాతలు – చిన్న నిర్మాతల మధ్య జరుగుతున్న అసమానతల పోరుగా మారాయి. థియేటర్ల కేటాయింపు, బెనిఫిట్ షోలు, చిన్న సినిమాలకు సరైన గౌరవం వంటి అంశాలు ఈ ఎన్నికల కేంద్ర బిందువుగా మారాయి.
ఈ నేపథ్యంలో చిన్న నిర్మాతల తరఫున నిర్మాత ప్రసన్న కుమార్ తీవ్ర స్థాయిలో స్వరం పెంచారు. పరిశ్రమ మొత్తం ఒక్కరి చేతుల్లోనే నడుస్తోందని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. చిన్న సినిమాలకు సరైన థియేటర్లు ఇవ్వడం లేదని, పెద్ద సినిమాలకే బెనిఫిట్ షోలు కేటాయిస్తున్నారని ఆరోపించారు. ఇది కేవలం వ్యాపార సమస్య కాదని... చిన్న నిర్మాతల మనుగడకు సంబంధించిన అంశమని స్పష్టం చేశారు.
ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కొందరు కావాలనే వక్రీకరిస్తున్నారని ప్రసన్న కుమార్ ఆరోపించారు. చిన్న నిర్మాతల సమస్యలు నిజాయతీగా పరిష్కరిస్తే... తాము ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటామని కూడా సవాల్ విసిరారు. ఇది తమ వ్యక్తిగత లాభాల కోసం కాదని, పరిశ్రమలో సమాన అవకాశాల కోసం చేసే పోరాటమని వెల్లడించారు.
పెద్ద నిర్మాతలు లేబర్ కమిషనర్ వద్దకు వెళ్లడం దురదృష్టకరమని వ్యాఖ్యానించిన ప్రసన్న కుమార్... చిన్న నిర్మాతలు సొంత డబ్బులతో నామినేషన్లు వేసుకుని పోరాడుతున్నారని తెలిపారు. గతంలో చివరకు మెడిక్లెయిమ్ సౌకర్యం కల్పిస్తామని చెప్పి... అది కూడా అమలు చేయలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.