హైదరాబాద్ - విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్

  • క్రిస్మస్ ముగియడంతో హైదరాబాద్ వైపు విపరీతంగా వాహనాల ఒత్తిడి
  • టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్
  • ట్రాఫిక్‌తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు

వరుసగా వచ్చిన క్రిస్మస్ సెలవులు ముగియడంతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి భారీ ట్రాఫిక్‌తో నిండిపోయింది. క్రిస్మస్ అనంతరం ఆఫీసులు, కాలేజీలు, పాఠశాలలు తిరిగి ప్రారంభం కావడంతో ఒకేసారి లక్షలాది మంది హైదరాబాద్‌ వైపు ప్రయాణం చేయడంతో రహదారిపై వాహనాల ఒత్తిడి విపరీతంగా పెరిగింది.


ప్రత్యేకంగా పంతంగి, చౌటుప్పల్, కోర్లపాడు టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. నేషనల్ హైవే 65పై ఔటర్ రింగ్ రోడ్ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్, హయత్‌నగర్, చౌటుప్పల్ వరకు ట్రాఫిక్‌తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో గంటల తరబడి వాహనాలు కదలని పరిస్థితి నెలకొంది.


ఇక ఆరు లేన్ల రోడ్డు విస్తరణ పనులు కూడా ట్రాఫిక్ సమస్యకు ప్రధాన కారణంగా మారాయి. చౌటుప్పల్, చిట్యాల, నార్కట్‌పల్లి, పంతంగి ప్రాంతాల్లో బ్రిడ్జిలు, అండర్‌పాస్‌ల నిర్మాణం కొనసాగుతుండటంతో రోడ్డు సామర్థ్యం గణనీయంగా తగ్గింది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతుండగా, ట్రాఫిక్ జామ్‌లు మరింత తీవ్రతరం అవుతున్నాయి. ఈ అభివృద్ధి పనులు పూర్తయ్యే వరకు ఇలాంటి పరిస్థితులు తప్పవని అధికారులు చెబుతున్నారు.


రద్దీ పెరిగిన నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాహనాలను మళ్లిస్తూ ట్రాఫిక్‌ను నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, అత్యవసర సేవలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంబులెన్స్‌లు సైతం ట్రాఫిక్‌లో చిక్కుకుపోతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఈ నేపథ్యంలో రాచకొండ ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. జాతీయ రహదారి మీద ప్రయాణించే వారు వీలైనంత వరకు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని, ప్రయాణానికి ముందు ఆన్‌లైన్‌లో ట్రాఫిక్ అప్‌డేట్‌లను చెక్ చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం కొనసాగుతున్న వాహనాల రద్దీ మరో రెండు రోజుల పాటు కొనసాగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.



More Telugu News