Vaibhav Suryavanshi: 14 ఏళ్లకే జాతీయ పురస్కారం.. బిహార్ క్రికెట్ సంచలనం వైభవ్ అరుదైన ఘనత

Bihar Cricketer Vaibhav Suryavanshi to receive Pradhan Mantri Rashtriya Bal Puraskar
  • 14 ఏళ్లకే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన బిహార్ క్రికెటర్ వైభవ్
  • రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బాల పురస్కారం ప్ర‌దానం
  • విజయ్ హజారే ట్రోఫీలో 84 బంతుల్లో 190 పరుగులతో రికార్డు సృష్టించిన వైభవ్
  • అవార్డు కారణంగా విజయ్ హజారే ట్రోఫీలోని మిగిలిన మ్యాచ్‌లకు దూరం
  • ప్రధాని నరేంద్ర మోదీతోనూ భేటీ కానున్న యువ సంచ‌ల‌నం
ప్రతిభకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తూ, బిహార్‌కు చెందిన 14 ఏళ్ల యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ఇప్పటికే పేరు తెచ్చుకున్న ఈ యువ సంచలనం, ఇప్పుడు చిన్నారులకు ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన 'ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం' అందుకోనున్నాడు.

ఢిల్లీలో ఈరోజు జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వైభవ్ ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని స్వీకరించనున్నాడు. ఈ కార్యక్రమం కోసం బుధవారమే ఢిల్లీకి చేరుకున్న వైభవ్, అవార్డు ప్రదానోత్సవం అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కూడా భేటీ కానున్నాడు. క్రీడలు, ఇతర రంగాల్లో రాణిస్తున్న యువతను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్‌పై జరిగిన మ్యాచ్‌లో వైభవ్ కేవలం 84 బంతుల్లో 190 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. అతని అసాధారణ ప్రతిభకు గుర్తింపుగా ఈ పురస్కారం వరించింది. అయితే, ఈ అవార్డు వేడుక కారణంగా అతను విజయ్ హజారే ట్రోఫీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు.

సాధారణంగా 5 నుంచి 18 ఏళ్ల లోపు వయసు గల చిన్నారులు ధైర్యసాహసాలు, కళలు, సైన్స్, క్రీడలు, సామాజిక సేవ వంటి రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన వారికి ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాన్ని అందిస్తారు. చిన్న వయసులోనే బిహార్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు సాగిన వైభవ్ ప్రయాణం దేశంలోని ఎంతో మంది వర్ధమాన క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తోంది.
Vaibhav Suryavanshi
Bihar cricket
Pradhan Mantri Rashtriya Bal Puraskar
Vijay Hazare Trophy
Droupadi Murmu
Narendra Modi
Indian cricket
Under 14 cricket
Cricket award
Sports award

More Telugu News