Pakistan Women: ప్రపంచ సగటులో సగం కూడా లేదు.. పాక్‌లో మహిళా ఉద్యోగుల దుస్థితి

Pakistans female labour force participation among lowest in world Says Report
  • పాకిస్థాన్‌లో అత్యంత దారుణంగా మహిళల ఉపాధి అవకాశాలు
  • శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం కేవలం 22.6 శాతమే
  • సాంస్కృతిక కట్టుబాట్లు, వ్యవస్థాగత లోపాలే ప్రధాన కారణం
  • రాజకీయ, మీడియా రంగాల్లోని మహిళలపై దాడులు, వేధింపులు
  • పరిస్థితి మారకపోతే పేదరికం తప్పదని నివేదిక హెచ్చరిక
పాకిస్థాన్‌లో మహిళలు శ్రామిక శక్తిలో, ఆర్థిక అవకాశాలలో తీవ్రమైన లింగ వివక్షను ఎదుర్కొంటున్నారని ఏథెన్స్‌కు చెందిన డైరెక్టస్ తన నివేదికలో వెల్లడించింది. దీనికి పాతుకుపోయిన సాంస్కృతిక కట్టుబాట్లు, వ్యవస్థాగత లోపాలు, నిర్మాణపరమైన బలహీనతలే కారణమని ఇవాళ‌ విడుదల చేసిన నివేదికలో స్పష్టం చేసింది.

నివేదిక ప్రకారం 15 నుంచి 64 ఏళ్ల వయసు గల మహిళల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతున్న వారి శాతం పాకిస్థాన్‌లో కేవలం 22.6 శాతంగానే ఉంది. ఇది ప్రపంచ సగటు 52.6 శాతంతో పోలిస్తే చాలా దారుణం. కనీసం దక్షిణాసియా సగటు 25.2 శాతం కంటే కూడా తక్కువగా ఉండటం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. దేశ రాజధాని ఇస్లామాబాద్‌లోనే పురుషులు 67 శాతం మంది శ్రామిక శక్తిలో ఉండగా, మహిళలు కేవలం 22.5 శాతంగా ఉన్నారు.

ఈ అసమానతలకు మహిళల కదలికలపై ఆంక్షలు, ఇంటి బాధ్యతలకే పరిమితం చేయాలనే భావన, వేతనాల్లో వ్యత్యాసాలు, ఆర్థిక సేవలు అందుబాటులో లేకపోవడం వంటివి ప్రధాన కారణాలని నివేదిక నొక్కి చెప్పింది. పట్టణ ప్రాంతాల్లోని మహిళలు సైతం సామాజిక కట్టుబాట్లు, కుటుంబ మద్దతు లేకపోవడం వల్ల ఉద్యోగాల్లో చేరడానికి, కొనసాగడానికి ఇబ్బందులు పడుతున్నారని వివరించింది.

ఆర్థిక, రాజకీయ రంగాల్లోనే కాకుండా, సామాజికంగా, భద్రతాపరంగా కూడా పాక్ మహిళలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నాయకత్వ స్థానాల్లో, మీడియా, సామాజిక రంగాల్లో ఉన్న మహిళలు లింగ ఆధారిత హింస, వేధింపులు, వ్యక్తిత్వ హనన దాడులను ఎదుర్కొంటున్నట్లు నివేదిక పేర్కొంది.

ఈ సమస్యలను అధిగమించడానికి కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయడం, సురక్షిత రవాణా, శిశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం, డిజిటల్, ఆర్థిక సేవలను మహిళలకు అందుబాటులోకి తేవడం వంటి చర్యలు చేపట్టాలని సూచించింది. లేకపోతే ఈ వ్యత్యాసాలు దేశంలో పేదరికానికి, వెనుకబాటుతనానికి దారితీస్తాయని హెచ్చరించింది.
Pakistan Women
Women Employment Pakistan
Pakistan Labor Force
Gender Inequality Pakistan
Women Empowerment Pakistan
Pakistan Economy
Islamabad
South Asia Gender Gap
Women in Workforce
Economic Opportunities for Women

More Telugu News