రూ.30 వేలు ఖర్చు పెట్టి అందుకే సినిమాలపై నెగిటివ్ ప్రచారం: బన్నీ వాసు

  • బుక్ మై షోలో రేటింగ్ తగ్గించడానికి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారన్న బన్నీ వాసు
  • ప్రేక్షకులు చిత్రాన్ని చూసి ఇచ్చే రేటింగ్ కోసం వేచి చూడాలని వ్యాఖ్య
  • రూ.30 వేల నుండి రూ.50 వేలతో టిక్కెట్లు కొనుగోలు చేసి నెగిటివ్ ప్రచారం చేస్తారన్న బన్నీ వాసు
కొంతమంది బుక్ మై షోలో రేటింగ్ తగ్గించడానికి ప్రణాళికాబద్ధంగా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని నిర్మాత బన్నీ వాసు అన్నారు. ప్రీమియర్ షో వేస్తే ఎవరో ఒకరు 200 టిక్కెట్లు బుక్ చేసుకుని, షో అవగానే అందరూ 1 రేటింగ్ ఇస్తారని, అలా చేయగానే బుక్ మై షోలో రేటింగ్ పడిపోతుందని ఆయన తెలిపారు. ప్రేక్షకులు మాత్రం చిత్రాన్ని చూసి ఇచ్చే రేటింగ్ కోసం వేచి చూడాలని ఆయన కోరారు.

త్రిగుణ్, అఖిల్ రాజ్, హెబ్బా పటేల్, సిరి హనుమంతు, పృథ్వీరాజ్ కీలక పాత్రలో శ్రీనివాస్ మన్నె దర్శకత్వంలో వంశీ నందిపాటి, దామోదర్ ప్రసాద్ నిర్మించిన హారర్ థ్రిల్లర్ చిత్రం 'ఈషా'. ఈ చిత్రంపై జరుగుతున్న నెగిటివ్ ప్రచారం గురించి నిర్మాతలు మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బన్నీ వాసు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

మన చిత్రాన్ని దించాలనుకుంటే 300 టిక్కెట్లను రూ.30 వేల నుండి రూ.50 వేలు ఖర్చు చేసి కొనుగోలు చేసి నెగిటివ్ ప్రచారం చేస్తారని ఆయన అన్నారు. థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుడు ఈ రేటింగ్ చూసి రాడని గుర్తుంచుకోవాలని సూచించారు. ఇలాంటివి తనకు చాలాసార్లు జరిగాయని, ఇప్పుడు 'ఈషా' చిత్ర నిర్మాతలు దీనిని ఎదుర్కొంటున్నారని అన్నారు. అందుకే వారు కాస్త ఆందోళన చెందుతున్నారని, తాను ఇవన్నీ దాటుకుని సాధువులా మారిపోయానని బన్నీ వాసు పేర్కొన్నారు.

సినిమా చూడకుండానే నెగిటివ్ రివ్యూ: నిర్మాతలు

కొందరు సినిమాను చూడకుండానే ఫేక్ నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారని నిర్మాత వంశీ నందిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. దామోదర్ ప్రసాద్‌తో కలిసి నిర్మించిన హారర్ థ్రిల్లర్ 'ఈషా' చిత్రంపై కొందరు కావాలని నెగిటివ్ రివ్యూలు రాశారని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రం అమెరికాలో ఇంకా విడుదల కాలేదని, అయినప్పటికీ అక్కడ ఒకరు నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చారని తెలిపారు.

ఇదే విషయమై రివ్యూ రాసిన వ్యక్తిని అడిగితే పరిశ్రమలో కొంతమంది చూసి చెప్పారని సమాధానం ఇచ్చాడని ఆయన అన్నారు. ఎవరో ఏదో చెబితే చిత్రం గురించి పేరాల కొద్దీ నెగిటివ్‌గా రాశాడని అన్నారు. ఎవరో నెగిటివ్ రివ్యూలు ఇస్తే చిత్రాన్ని చూడకుండా ఉండటానికి ప్రజలు పిచ్చివాళ్లు కాదని వ్యాఖ్యానించారు. ప్రీమియర్ వేసిన థియేటర్లు నిండిపోయాయని, సినిమా చూసిన ప్రేక్షకులు బాగుందని అంటున్నారని తెలిపారు.

ఇళ్లలో రెండు మూడు గదుల్లో కొన్ని కంప్యూటర్లు పెట్టుకుని ఉద్దేశపూర్వకంగా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని మరో నిర్మాత దామోదర్ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి సినిమాను వారు ప్రమోట్ చేసుకోవాలని, కానీ ఇతరుల సినిమాలతో వారికి ఎందుకని ప్రశ్నించారు. ఇంత నీచంగా వ్యాపారం చేయడం సరికాదని అన్నారు. తాను మాట్లాడాల్సి వస్తే ఇలా నెగిటివ్ ప్రచారం చేసేవాళ్ల కెరీర్ పరిశ్రమలో ముగిసినట్లేనని హెచ్చరించారు.


More Telugu News