Delivery Workers Strike: దేశవ్యాప్తంగా డెలివరీ వర్కర్ల సమ్మె.. ప్రధాన డిమాండ్లు ఇవే!

Swiggy Zomato Gig Workers Call For All India Strike
  • దేశవ్యాప్తంగా సమ్మెకు దిగిన డెలివరీ, గిగ్ వర్కర్లు
  • ఇవాళ‌, ఈ నెల 31న‌ నిరసన కార్యక్రమాలు
  • తగ్గిపోతున్న ఆదాయం, పనిభద్రత లేకపోవడంపై ఆందోళన
  • '10 నిమిషాల డెలివరీ' విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్
  • ప్లాట్‌ఫామ్ కంపెనీలను నియంత్రించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
ప్రముఖ ఈ-కామర్స్, ఫుడ్ డెలివరీ, హోమ్ సర్వీస్ ప్లాట్‌ఫామ్‌లకు చెందిన డెలివరీ, గిగ్ వర్కర్లు దేశవ్యాప్తంగా సమ్మె బాట పట్టారు. స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఈరోజు, ఈ నెల 31న‌ నిరసనల్లో పాల్గొంటున్నారు. క్షీణిస్తున్న పని పరిస్థితులు, సరైన వేతనాలు లేకపోవడం, భద్రత, సామాజిక భద్రత కల్పించకపోవడాన్ని నిరసిస్తూ వారు ఈ సమ్మెకు పిలుపునిచ్చారు.

పండుగల సీజన్‌లో డెలివరీ వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే తమను కంపెనీలు దోపిడీ చేస్తున్నాయని కార్మిక సంఘాలు ఆరోపించాయి. "ఎక్కువ గంటలు పనిచేయించుకోవడం, సంపాదన తగ్గిపోవడం, అశాస్త్రీయ డెలివరీ టార్గెట్లు, అకారణంగా ఐడీలను బ్లాక్ చేయడం, ఉద్యోగ భద్రత లేకపోవడం వంటి సమస్యలతో డెలివరీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు" అని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (టీజీపీడ‌బ్ల్యూయూ), ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్-బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ (ఐఎఫ్ఏటీ) సంయుక్త ప్రకటనలో తెలిపాయి.

కార్మికుల ప్రధాన డిమాండ్లు ఇవే..
పారదర్శకమైన వేతన విధానం అమలు చేయడంతో పాటు, వివాదాస్పదమైన "10 నిమిషాల డెలివరీ" మోడల్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఎలాంటి విచారణ లేకుండా ఐడీలను బ్లాక్ చేయడాన్ని ఆపాలని, భద్రతా పరికరాలు అందించాలని కోరుతున్నారు. వివక్ష లేకుండా పని కేటాయించాలని, ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, పెన్షన్ వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకొని, ప్లాట్‌ఫామ్ కంపెనీల కార్యకలాపాలను నియంత్రించాలని టీజీపీడ‌బ్ల్యూయూ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ కోరారు. "కంపెనీలు కార్మికుల జీవితాలతో ఆడుకుంటూ లాభాలు ఆర్జిస్తుంటే ప్రభుత్వాలు ప్రేక్షకపాత్ర వహించవద్దు. న్యాయం, గౌరవం, జవాబుదారీతనం కోసమే ఈ సమ్మె చేస్తున్నాం" అని ఆయన స్పష్టం చేశారు.
Delivery Workers Strike
Swiggy
Zomato
Zepto
Blinkit
Amazon
Flipkart
Gig Workers
Wage Issues
Labor Rights

More Telugu News