DK Shivakumar: చెప్పేది వినండి.. మీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు: డి.కె. శివకుమార్

DK Shivakumar Says No Need to Answer Every Question
  • ఎప్పుడూ ప్రసంగాలకు పరిమితం కాలేదు.. పార్టీ అప్పగించిన ప్రతి పని చేశానని వ్యాఖ్య
  • కాంగ్రెస్ కార్యకర్తగా పోస్టర్లు అతికించా, చెత్తను ఊడ్చానన్న శివకుమార్
  • ప్రతిఫలంగా ఏం ఆశిస్తున్నారని ప్రశ్నిస్తే, నేను మీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అసహనం
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశంపై చర్చ జరుగుతున్న వేళ, ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో తన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను ఎప్పుడూ ప్రసంగాలకు పరిమితం కాలేదని, పార్టీ కోసం, పార్టీ అప్పగించిన ప్రతి పనిని చేశానని అన్నారు. "వేదిక మీదకు వచ్చి ప్రసంగం చేసి నా పని అయిపోయిందని ఇంటికి వెళ్లలేదు. కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో చేశాను" అని ఆయన స్పష్టం చేశారు.

తాను ఏ పదవిలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తగానే ఉండటానికి ఇష్టపడతానని డి.కె.శివకుమార్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ఏ పదవిలో ఉన్నప్పటికీ మొదట పార్టీ కార్యకర్తనే అని గుర్తుంచుకోవాలని అన్నారు. తాను కార్యకర్తగా, పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ జెండా ఏర్పాటు చేశానని, పోస్టర్లు అతికించానని, చెత్తను ఊడ్చానని ఆయన పేర్కొన్నారు. పార్టీ ఏం చెబితే అది చేశానని అన్నారు.

మీరు పార్టీకి చేసిన పనికి ప్రతిఫలంగా ఏం ఆశిస్తున్నారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, తాను చెప్పేది వినాలని, ప్రతి ప్రశ్నకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. పార్టీలోని అంతర్గత విషయాలను రాష్ట్రస్థాయిలోనే పరిష్కరించుకోవాలని ఖర్గే చెప్పారని, అగ్ర నాయకులు తమకు అలాంటి మార్గనిర్దేశనం చేస్తూనే ఉంటారని అన్నారు. మరోసారి ఢిల్లీకి వెళ్లే ఆలోచన తనకు లేదని, పార్టీ అధిష్ఠానం నుంచి పిలుపు వస్తే మాత్రం వెళతానని ఆయన తెలిపారు.

ఖర్గేతో ఎలాంటి రాజకీయ అంశాలు చర్చించలేదని శివకుమార్ స్పష్టం చేశారు. అలాంటి విషయాలు చర్చించాల్సిన అవసరం కూడా లేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తాను పార్టీ అధిష్ఠానం సూచనల మేరకు ముందుకు సాగుతామని ఆయన వెల్లడించారు.
DK Shivakumar
Karnataka
Mallikarjun Kharge
Congress party
Chief Minister
Siddaramaiah
Politics

More Telugu News