Danam Nagender: “దానం నాగేందర్ ఎక్కడుంటే గెలుపు అక్కడే” అనే వ్యాఖ్యలపై చింతల రామచంద్రారెడ్డి వ్యంగ్యం

Danam Nagenders Comments Criticized by Chintala Ramachandra Reddy
  • దానం బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారన్న చింతల
  • ఆయన రాజకీయ విలువలపై మాట్లాడటం హాస్యాస్పదం అని ఎద్దేవా
  • ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక అనివార్యమని వ్యాఖ్య

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన “దానం ఎక్కడుంటే గెలుపు అక్కడే” వ్యాఖ్యలపై రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. ఈ వ్యాఖ్యలకు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఘాటుగా స్పందిస్తూ, దానం రాజకీయ ప్రస్థానాన్ని ఎద్దేవా చేశారు. అధికారం ఉన్న చోటుకు మకాం మార్చడమే దానం రాజకీయ స్టైల్ అని, అది ప్రజలందరికీ బాగా తెలిసిన విషయమని అన్నారు.


బీఆర్‌ఎస్ గుర్తుపై గెలిచి, ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ ఇప్పుడు నైతికత, రాజకీయ విలువలపై మాట్లాడటం హాస్యాస్పదమని చింతల మండిపడ్డారు. ప్రజల తీర్పుతో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, ఎన్నిసార్లు నిజంగా ప్రజల మధ్యకు వచ్చారని ఆయన ప్రశ్నించారు. మాటలకే పరిమితమై, పనిలో మాత్రం ప్రజలకు కనిపించలేదని ఆరోపించారు.


ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక అనివార్యమని చింతల స్పష్టం చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అధికార బలంతో రాజకీయాలు నడిపించవచ్చని అనుకుంటే అది పొరపాటేనని, ప్రజలే అసలు తీర్పు చెబుతారని వ్యాఖ్యానించారు.


అభివృద్ధి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 300 డివిజన్లలో గెలుస్తామని కలలు కంటోందని చింతల ఎద్దేవా చేశారు. అవి పగటి కలలేనని, వాటికి ప్రజలే సరైన సమాధానం చెబుతారని స్పష్టం చేశారు.

Danam Nagender
Khairatabad
Chintala Ramachandra Reddy
Telangana Politics
BRS
Congress Party
GHMC Elections
Political Criticism
Telangana Elections
Hyderabad Politics

More Telugu News