Amit Shah: భారీ ఎన్ కౌంటర్ పై అమిత్ షా స్పందన
- ఒడిశా ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టుల మృతి
- నక్సలిజం అంతానికి మరో కీలక అడుగు అన్న అమిత్ షా
- ఆపరేషన్లు మరింత తీవ్రతరమవుతాయని హెచ్చరిక
దేశంలో మావోయిస్టు కార్యకలాపాలపై కేంద్ర ప్రభుత్వం మరింత దూకుడు పెంచింది. ఒడిశాలోని కంధమాల్ జిల్లా గుమ్మా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందిస్తూ.. ఇది నక్సలిజం అంతానికి మరో కీలక అడుగు అని వ్యాఖ్యానించారు. 2026 నాటికి దేశం మొత్తాన్ని నక్సలిజం నుంచి పూర్తిగా విముక్తం చేస్తామని తెలిపారు. ఒడిశాను మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యమని చెప్పారు. భద్రతా బలగాల ఆపరేషన్లు మరింత తీవ్రతరం అవుతాయని స్పష్టం చేశారు.
ఈ ఉదయం కంధమాల్ జిల్లాలోని గుమ్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న నమ్మకమైన సమాచారం భద్రతా బలగాలకు అందింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, ప్రత్యేక బలగాలు ఆ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ సమయంలో మావోయిస్టులు కాల్పులకు దిగడంతో రెండు వర్గాల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. కొంతసేపు కొనసాగిన కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. ఎన్‌కౌంటర్ అనంతరం ఆ ప్రాంతం నుంచి భారీగా ఆయుధాలు, బుల్లెట్లు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఎన్‌కౌంటర్‌లో హతమైన వారిలో మావోయిస్టు ఉద్యమంలో అత్యంత కీలక నేతగా గుర్తింపు పొందిన పాక హనుమంతు అలియాస్ గణేశ్ కూడా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం, ఒడిశా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాయి. గణేశ్ స్వస్థలం తెలంగాణలోని నల్గొండ జిల్లా చండూర్. ఆయనపై రూ.1.10 కోట్ల రివార్డు ఉంది. దాదాపు 40 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో కొనసాగుతూ, వివిధ కీలక హోదాల్లో పనిచేశారు. మావోయిస్టు సంస్థాగత విస్తరణలో గణేశ్ కీలక పాత్ర పోషించారని భద్రతా వర్గాలు చెబుతున్నాయి.