Bandi Sanjay: జగన్‌తో ఏం ఒప్పందం జరిగిందో కేసీఆర్ చెప్పాలి.. కేసీఆర్ కుటుంబం తెలంగాణకు శని: బండి సంజయ్

Bandi Sanjay Demands KCR Explain Agreement with Jagan on Krishna River Water
  • కాళేశ్వరం స్కామ్ నుంచి దృష్టి మళ్లించేందుకే కేసీఆర్ కృష్ణా జలాల గురించి మాట్లాడుతున్నారన్న సంజయ్
  • ముడుపుల కోసం తెలంగాణను తాకట్టు పెట్టారని మండిపాటు
  • రేవంత్ భాష ఆయన్నే నష్టపరుస్తుందని వ్యాఖ్య

కృష్ణా నదీ జలాల అంశంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న వ్యాఖ్యలను కేంద్రమంత్రి, బీజేపీ నేత బండి సంజయ్‌ తీవ్రంగా ఖండించారు. కాళేశ్వరం ప్రాజెక్టు స్కాం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కేసీఆర్‌ ఇప్పుడు కృష్ణా జలాల విషయాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదని స్పష్టంగా చెప్పారు. కృష్ణా జలాల పంపకాల్లో తెలంగాణకు జరిగిన నష్టానికి పూర్తిగా కేసీఆర్‌నే బాధ్యుడని వ్యాఖ్యానించారు.


కృష్ణా నదీ జలాల పంపకాల్లో తెలంగాణకు రావాల్సిన వాటాను కేసీఆర్‌ తాకట్టు పెట్టారని బండి సంజయ్‌ ఆరోపించారు. ‘‘కృష్ణా జలాల్లో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలకే ఒప్పందం చేసుకున్నారు. 575 టీఎంసీల కోసం పోరాడాల్సిన సందర్భంలో కేసీఆర్‌ మౌనంగా ఉన్నారు. ముడుపుల కోసమే తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టారు’’ అని విమర్శించారు. ఈ విషయాలను ఆధారాలతో సహా బయట పెట్టింది తానేనని చెప్పారు. ఏపీ మాజీ సీఎం జగన్‌తో ఏం ఒప్పందం జరిగిందో ప్రజలకు కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. 


అప్పట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తానే అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిపించానని బండి సంజయ్ గుర్తు చేశారు. కృష్ణా జలాల అంశంలో కేసీఆర్‌ పాత్ర పూర్తిగా ద్రోహపూరితమని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వెలుగులోకి వస్తున్న అక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కేసీఆర్‌ కృష్ణా జలాల అంశాన్ని లేవనెత్తుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరం స్కాం నుంచి తప్పించుకునేందుకే కొత్త ఇష్యూ తీసుకొచ్చారని దుయ్యబట్టారు.


కేసీఆర్ కుటుంబం మొత్తం తెలంగాణకు భారంగా మారిందని బండి సంజయ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘కేసీఆర్‌ కుమారుడు కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారు. కేసీఆర్ కుటుంబమే తెలంగాణకు పెద్ద శని. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం’’ అని స్పష్టం చేశారు.


ఇదే సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యల్ని కూడా బండి సంజయ్‌ తప్పుబట్టారు. ‘‘ఎవరి మీద విమర్శలు చేసినా మాటల తీరులో సంయమనం ఉండాలి. రేవంత్‌రెడ్డి మాట్లాడిన భాష సరైనది కాదు. ఇలాంటి మాటలు చివరకు ఆయన్నే నష్టపరుస్తాయి’’ అని సూచించారు. హిందూ ధర్మం ప్రతి వ్యక్తి సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటుందని తెలిపారు. గతంలో కేసీఆర్‌ అనుచితంగా మాట్లాడినప్పుడు తాము ఖండించామని, ఇప్పుడు సీఎం రేవంత్ కూడా తన మాటలపై పునరాలోచన చేసుకోవాలని సూచించారు.

Bandi Sanjay
KCR
Kaleshwaram Project
Krishna River Water
Revanth Reddy
Telangana Politics
BJP
BRS Party
AP Government
Jagan Mohan Reddy

More Telugu News