రజనీకాంత్ 'జైలర్ 2'లో షారుక్ ఖాన్.. ఆకాశాన్నంటుతున్న అంచనాలు!

  • బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన 'జైలర్'
  • మరింత భారీగా తెరకెక్కుతున్న 'జైలర్ 2'
  • ఈ చిత్రంలో షారుక్ నటిస్తున్నట్టు వెల్లడించిన మిథున్ చక్రవర్తి

సూపర్‌స్టార్ రజనీకాంత్ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘జైలర్’. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ విజయంతోనే ఇప్పుడు తెరకెక్కుతున్న ‘జైలర్‌ 2’పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. 


‘జైలర్’ మొదటి భాగంలో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ వంటి అగ్ర నటులు అతిథి పాత్రల్లో మెరిసి అభిమానులను అలరించారు. అదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ, ‘జైలర్‌ 2’ను మరింత భారీగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు ఈ హైప్‌ను మరింత రెట్టింపు చేశాయి. 


మిథున్ చక్రవర్తి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ సీక్వెల్‌లో షారుక్ ఖాన్, మోహన్‌లాల్, రమ్యకృష్ణ, శివరాజ్‌కుమార్ కీలక అతిథి పాత్రల్లో కనిపించనున్నారని వెల్లడించారు. ముఖ్యంగా షారుక్ ఖాన్ పేరు అధికారికంగా వినిపించడంతో, అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.


ఈ సీక్వెల్‌లో తన పాత్ర గురించి ఇప్పటికే శివరాజ్‌కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్ట్‌ 1 ఎక్కడ ముగిసిందో, అక్కడి నుంచే పార్ట్‌ 2 ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. తన పాత్రకు ఈసారి ఎక్కువ స్క్రీన్ టైమ్ ఉంటుందని వెల్లడించారు. ఇప్పటికే కొంత షూటింగ్‌లో పాల్గొన్నానని, జనవరిలో మిగతా భాగం పూర్తి చేస్తానని తెలిపారు.


‘జైలర్’లో రజనీకాంత్‌ను పవర్‌ఫుల్‌గా చూపించిన విధానం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, స్టైలిష్ ప్రెజెంటేషన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అదే స్టైల్‌ను మరింత అప్‌గ్రేడ్ చేసి, ‘జైలర్‌ 2’ను మరింత గ్రాండ్‌గా తీర్చిదిద్దుతున్నారని సినీ వర్గాల సమాచారం. మరోవైపు, 2026 జూన్‌ 12న ‘జైలర్‌ 2’ను విడుదల చేయాలని చిత్ర యూనిట్ లక్ష్యంగా పెట్టుకుంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ ప్రమోషన్లతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.



More Telugu News