మీ సపోర్ట్ నాకు అవసరం లేదు.. నా హద్దులు నాకు తెలుసు: శివాజీకి అనసూయ స్ట్రాంగ్ కౌంటర్
- శివాజీ సానుభూతి తనకు అవసరం లేదన్న అనసూయ
- తనను ఎలా కాపాడుకోవాలో తనకు తెలుసని వ్యాఖ్య
- శివాజీది నార్సిస్టిక్ ప్రవర్తన అన్న అనసూయ
టాలీవుడ్‌లో ఇటీవల చర్చనీయాంశంగా మారిన ‘దండోరా’ సినిమా ఈవెంట్ వివాదం మరింత ముదురుతోంది. హీరోయిన్ల దుస్తులపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే తీవ్ర విమర్శలకు దారి తీయగా, తాజాగా ఆయన తనను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలకు నటి అనసూయ భరద్వాజ్ గట్టిగా బదులిచ్చారు.
“త్వరలోనే మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు కూడా రావాలని కోరుకుంటున్నా” అంటూ శివాజీ చేసిన వ్యాఖ్యల పట్ల అనసూయ తీవ్రంగా స్పందించారు. దీనిపై ఆమె సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేసి, తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారు. చాలా దాటుకుని వచ్చానని.. మీ సానుభూతి తనకు అవసరం లేదని చెప్పారు. తనను ఎలా కాపాడుకోవాలో తనకు తెలుసని అన్నారు.
ప్రెస్ మీట్ లో తనను బాధితుడిగా చూపించుకునే ప్రయత్నాన్ని శివాజీ చేస్తున్నారని... అది పూర్తిగా నార్సిస్టిక్ ప్రవర్తన అని వ్యాఖ్యానించారు. శివాజీ వ్యాఖ్యలను వ్యక్తిగతంగా కాకుండా... మొత్తం మహిళలపై చేసిన వ్యాఖ్యలుగా ఆమె అభివర్ణించారు.