On Road Indian: 'అరుణాచల్ భారత్‌దే' అన్నందుకు యూట్యూబర్ కు వేధింపులు.. చైనా విమానాశ్రయంలో 15 గంటల నిర్బంధం!

On Road Indian YouTuber Detained in China Over Arunachal Pradesh Comment
  • పాస్‌పోర్ట్ స్టిక్కర్ వేసి కూడా వెనక్కి తీసుకున్న అధికారులు
  • తిండి కూడా పెట్టకుండా వేధింపులు
  • ఎలక్ట్రానిక్ పరికరాల స్వాధీనం 
చైనా పర్యటనకు వెళ్లిన ఒక భారతీయ ట్రావెల్ వ్లాగర్‌కు అక్కడ ఊహించని పరిణామం ఎదురైంది. 'అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగం' అంటూ గతంలో చేసిన వ్యాఖ్యల కారణంగా చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు అతడిని 15 గంటల పాటు నిర్బంధించారు. 'ఆన్ రోడ్ ఇండియన్' (On Road Indian) పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న ఈ యువకుడు తనకు ఎదురైన అనుభవాన్ని ఒక వీడియో ద్వారా పంచుకున్నాడు.

ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్ద అధికారులు మొదట ప్రొఫెషనల్‌గానే వ్యవహరించారు. పాస్‌పోర్ట్‌పై స్టిక్కర్ కూడా వేశారు. కానీ, స్టాంప్ వేసే సమయంలో ఒక్కసారిగా ఉన్నతాధికారులను పిలిపించి, అతడిని నిర్బంధ ప్రాంతానికి తరలించారు. సుమారు రెండు గంటల పాటు వేచి చూసిన తర్వాత, ఒక గదిలోకి తీసుకెళ్లి గంటల తరబడి విచారించారు. ఐప్యాడ్ మినహా అతడి దగ్గరున్న ఎలక్ట్రానిక్ పరికరాలన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు.

తాను ఒక యూట్యూబర్‌నని, అరుణాచల్ ప్రదేశ్ విషయంలో తాను తీసుకున్న స్టాండ్ వల్లే ఈ సమస్య వచ్చిందని విచారణలో అతడికి అర్థమైంది. "భారత్-చైనా మధ్య భూ వివాదం నడుస్తోంది. వారి దేశంలో నిలబడి నేను ఆ వ్యాఖ్యలు చేయడం వారికి కోపం తెప్పించింది. నాతో పాటు ఉన్న ఇతర దేశస్థులకు ఆహారం ఇచ్చారు కానీ, నాకు కనీసం తిండి కూడా పెట్టలేదు" అని ఆ యూట్యూబర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఐఐటీ గౌహతి డ్రాపౌట్ అయిన ఈ యువకుడు, ఈశాన్య రాష్ట్రాలతో తనకున్న అనుబంధం కారణంగానే అరుణాచల్ పౌరుల నిర్బంధంపై గతంలో స్పందించానని క్లారిటీ ఇచ్చాడు.

అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా 'దక్షిణ టిబెట్'గా పేర్కొంటూ వివాదం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల యూకేలో నివసిస్తున్న పెమ్ వాంగ్ థాంగ్‌డోక్ అనే భారతీయ మహిళను కూడా షాంఘై ఎయిర్‌పోర్ట్‌లో చైనా అధికారులు ఇలాగే నిర్బంధించారు. ఆమె అరుణాచల్ ప్రదేశ్‌లో జన్మించినందున ఆమె పాస్‌పోర్ట్ చెల్లదని వారు వాదించడం గమనార్హం. వరుసగా జరుగుతున్న ఇలాంటి ఘటనలు భారత్-చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి.
On Road Indian
Arunachal Pradesh
China
Indian YouTuber
Travel Vlogger
China airport detention
India China border
South Tibet
Pem Wang Thongdok
IIT Guwahati

More Telugu News