అమెరికా కంటే భారత్‌లోనే బెటరా?.. నెట్టింట వైరల్ అయిన ఎన్నారై మాటలు!

  • 8 ఏళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన ఎన్నారై ఇక్క‌డి అభివృద్ధి చూసి ఆశ్చర్యం
  • ఇక్కడి అభివృద్ధి, తక్కువ ఖర్చులపై పోస్ట్
  • అమెరికాతో పోలిస్తే వైద్యం, మొబైల్ ఖర్చులు చాలా తక్కువని వ్యాఖ్య‌
  • ఎన్నారై పోస్ట్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు
ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌లో అడుగుపెట్టిన తన స్నేహితుడు, దేశంలో చోటుచేసుకున్న అనూహ్యమైన అభివృద్ధిని, ఇక్కడి తక్కువ ఖర్చులను చూసి షాక్ అయ్యారంటూ ఓ ఎన్నారై చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట‌ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి.

వివరాల్లోకి వెళితే... 'వీకెండ్ ఇన్వెస్టింగ్' వ్యవస్థాపకుడు అలోక్ జైన్, న్యూయార్క్ నుంచి వచ్చిన తన స్నేహితుడి అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. "ఎనిమిదేళ్ల తర్వాత నా స్నేహితుడు భారత్‌కు వచ్చాడు. దేశంలోని అద్భుతమైన శక్తిని, వేగవంతమైన అభివృద్ధిని చూసి అతను ఎంతో ప్రశంసించాడు" అని జైన్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. దేశంలో నివసించే వారి కంటే బయటివారి కోణం భిన్నంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

భారత్‌లో వైద్యం, రవాణా, ఇంటర్నెట్, మొబైల్ ఖర్చులు చాలా తక్కువగా ఉండటం చూసి తన స్నేహితుడు ఆశ్చర్యపోయాడని జైన్ తెలిపారు. అమెరికాలో తన ఇంట్లో మొబైల్, డేటా కోసం నెలకు 600 డాలర్లు (సుమారు రూ.50,000), నలుగురు సభ్యుల కుటుంబానికి ఆరోగ్య బీమా కోసం ఏటా 30,000 డాలర్లు (సుమారు రూ.25 లక్షలు), ఆస్తిపన్నుగా 2 శాతం చెల్లిస్తున్నట్లు స్నేహితుడు చెప్పాడని వివరించారు. అమెరికాలో గాలి నాణ్యత బాగున్నప్పటికీ, భారత్‌లో అంతకంటే ఎక్కువ మంచి విషయాలు జరుగుతున్నాయని జైన్ అన్నారు.

ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నరకాలుగా స్పందించారు. చాలామంది ఈ అభిప్రాయంతో ఏకీభవించారు. "నేను న్యూయార్క్‌లో ఉన్నాను, ఇవన్నీ నిజమే" అని ఒకరు కామెంట్ చేయగా, "సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మికతను కూడా జోడిస్తే భారత్ మరింత గొప్పగా కనిపిస్తుంది" అని మరొకరు పేర్కొన్నారు.

అయితే, మరికొందరు ఈ పోస్ట్‌ను విమర్శించారు. "జీవన ప్రమాణాలను నిర్దేశించే గాలి నాణ్యత, నడవడానికి వీలైన ప్రదేశాల విషయంలో న్యూయార్క్‌తో పోలికే లేదు" అని ఒకరు వ్యాఖ్యానించారు. "నిజంగా అంత బాగుంటే, శాశ్వతంగా భారత్‌కు తిరిగి రమ్మని మీ స్నేహితుడిని అడగండి" అని ఇంకొకరు సవాలు విసిరారు. కాగా, అమెరికాలో వైద్య ఖర్చులు భరించలేక 17 ఏళ్ల తర్వాత భారత్‌కు తిరిగి వచ్చామని గత నెలలో ఓ ఎన్నారై దంపతులు చెప్పిన విషయం తెలిసిందే.


More Telugu News