త్వరలో 'భారత్ ట్యాక్సీ'.. లాభాలన్నీ డ్రైవర్లకే!

  • త్వరలో 'భారత్ ట్యాక్సీ' సేవలు ప్రారంభిస్తామ‌న్న అమిత్ షా
  • లాభాలన్నీ పూర్తిగా డ్రైవర్లకే పంచుతామని వెల్లడి
  • హ‌ర్యానాలో సహకార సమ్మేళనంలో అమిత్ షా ప్రకటన
దేశంలో త్వరలోనే 'భారత్ ట్యాక్సీ' పేరుతో కొత్త సేవలను ప్రారంభించనున్నట్లు కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ విధానంలో వచ్చే లాభాలను పూర్తిగా డ్రైవర్లకే పంచుతామని ఆయన స్పష్టం చేశారు. కస్టమర్లకు మెరుగైన సౌకర్యం కల్పించడంతో పాటు డ్రైవర్ల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు.

హ‌ర్యానాలోని పంచకులలో నిన్న‌ జరిగిన సహకార సమ్మేళనంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "సహకార మంత్రిత్వ శాఖ చొరవతో త్వరలోనే 'భారత్ ట్యాక్సీ'ని ప్రారంభిస్తాం. దీని ద్వారా వచ్చే ప్రతి పైసా లాభం డ్రైవర్ సోదరులకే చెందుతుంది. ఇది డ్రైవర్ల లాభాలను పెంచుతుంది" అని వివరించారు.

ఈ కార్యక్రమంలో దేశానికి హ‌ర్యానా అందిస్తున్న సేవలను అమిత్ షా కొనియాడారు. దేశ ఆహార భద్రత, పాడి ఉత్పత్తి, క్రీడారంగంలో ఆ రాష్ట్రం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. పంజాబ్‌తో కలిసి హ‌ర్యానా దేశాన్ని ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధం చేసిందని ప్రశంసించారు. చిన్న రాష్ట్రమైనప్పటికీ జనాభా నిష్పత్తి ప్రకారం కేంద్ర సాయుధ బలగాలకు, త్రివిధ దళాలకు అత్యధిక సైనికులను అందిస్తున్న ఘనత హ‌ర్యానాదే అని గుర్తుచేశారు.

పశుపోషణ, వ్యవసాయం, సహకార రంగాలను అనుసంధానించడం ద్వారానే దేశంలో శ్రేయస్సు సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ నాయకత్వంలో 2014లో రూ. 22 వేల కోట్లుగా ఉన్న వ్యవసాయ బడ్జెట్‌ను రూ. 1.27 లక్షల కోట్లకు, రూ. 80 వేల కోట్లుగా ఉన్న గ్రామీణాభివృద్ధి బడ్జెట్‌ను రూ. 1.87 లక్షల కోట్లకు పెంచామని అమిత్ షా తెలిపారు.


More Telugu News