GHMC: జీహెచ్ఎంసీ ఆర్డినెన్స్‌పై పిటిషన్.. వివరణ కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

GHMC Merger High Court Issues Notices to Telangana Government
  • ఆర్డినెన్స్‌పై వివరణ ఇవ్వాలన్న హైకోర్టు
  • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా పలువురికి నోటీసులు
  • పిటిషన్ దాఖలు చేసిన తుక్కుగూడకు చెందిన వ్యక్తి
జీహెచ్ఎంసీ చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌పై వివరణ కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖలకు ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.

తుక్కుగూడతో పాటు మరికొన్ని మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ జీహెచ్ఎంసీ చట్ట సవరణ తీసుకురావడాన్ని సవాల్ చేస్తూ తుక్కుగూడకు చెందిన బరిగెల రాజు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆర్డినెన్స్ జారీ చేయగా, దీనిపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఆర్డినెన్స్ ద్వారా తుక్కుగూడ జీహెచ్ఎంసీలో విలీనమైందని పిటిషనర్ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పిటిషనర్ పోటీ చేయాలని అనుకుంటున్నారని, కానీ విలీనం కారణంగా హద్దులు మారడంతోపాటు ఇతర ప్రభావాలు పడుతున్నాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

నోటిఫికేషన్‌‍కు ముందు మున్సిపల్ కార్పొరేషన్‌తో సంప్రదింపులు జరపలేదని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ ఆర్డినెన్స్ పారదర్శకంగా లేనందున నిలిపివేయాలని కోరారు. పిటిషనర్ వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
GHMC
Telangana High Court
GHMC Act
Municipalities Merger
Tukkuguda
Municipal Elections

More Telugu News