Revanth Reddy: కొత్త స‌ర్పంచ్‌ల‌కు తీపి క‌బురు.. గ్రామాల‌కు ప్ర‌త్యేకంగా రూ.10ల‌క్ష‌లు

CM Revanth Reddy Announces Rs 10 Lakh for Telangana Villages Development
  • సర్పంచ్‌లకు నేరుగా ప్రత్యేక అభివృద్ధి నిధులు ఇస్తామ‌న్న సీఎం రేవంత్‌
  • పెద్ద గ్రామాలకు రూ.10 లక్షలు, చిన్న గ్రామాలకు రూ.5 లక్షలు ప్ర‌క‌ట‌న‌
  • అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామ‌ని హామీ
  • పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధికి పిలుపునిచ్చిన ముఖ్య‌మంత్రి
కొడంగల్ నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లకు తీపి క‌బురు చెప్పారు. గ్రామాల అభివృద్ధి కోసం ఇకపై సర్పంచ్‌లకు నేరుగా నిధులు అందిస్తామని ప్రకటించారు. పెద్ద గ్రామాలకు రూ.10 లక్షలు, చిన్న గ్రామాలకు రూ.5 లక్షలు చొప్పున ప్రత్యేక అభివృద్ధి నిధిగా ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఈ నిధులు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల జోక్యం లేకుండా నేరుగా గ్రామ పంచాయతీలకు అందుతాయని సీఎం స్పష్టం చేశారు. దీని ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని పేర్కొన్నారు. అలాగే గ్రామాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు.

తన రాజకీయ ప్రయాణంలో కొడంగల్ ప్రజల సహకారాన్ని గుర్తు చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి, “2009 నుంచి మీరు నన్ను మీ భుజాలపై మోశారు. మీ నమ్మకమే నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చింది” అని అన్నారు. కొడంగల్‌ను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు.

గ్రామాల్లో వివక్ష లేకుండా పాలన సాగాలని, పార్టీలు-పంతాలు పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సర్పంచ్‌లకు సూచించారు. గ్రామాల అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని సీఎం కోరారు. పార్టీలకు అతీతంగా గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం ముందుకు సాగుతాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సంద‌ర్భంగా గ్రామాలే దేశానికి వెన్నెముక అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 
Revanth Reddy
Telangana CM
Kodangal
Village development funds
Sarpanch
Telangana villages
Rural development
Telangana government schemes
Village Panchayats
Ration cards

More Telugu News