Virat Kohli: విజయ్ హజారే ట్రోఫీలో కోహ్లీ సూప‌ర్ సెంచ‌రీ.. ఢిల్లీ ఘన విజయం

Virat Kohli Super Century in Vijay Hazare Trophy Delhi Wins
  • 299 పరుగుల లక్ష్యాన్ని కేవలం 37.4 ఓవర్లలోనే చేధించిన ఢిల్లీ 
  • 101 బంతుల్లో 131 పరుగులతో కోహ్లీ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌
  • లిస్ట్-ఏ క్రికెట్‌లో 16,000 పరుగుల ఘనత అందుకున్న విరాట్‌
  • రికీ భుయ్ శతకం వృథా
టీమిండియా స్టార్ ప్లేయ‌ర్‌ విరాట్ కోహ్లీ మరోసారి సత్తా చాటాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఆంధ్రప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 101 బంతుల్లో 131 పరుగులు చేసి ఢిల్లీ జట్టుకు అద్భుత విజయానికి అందించాడు. 299 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం 37.4 ఓవర్లలోనే చేధించి, నాలుగు వికెట్ల‌ తేడాతో ఆంధ్ర జ‌ట్టును ఓడించింది. దాదాపు 15 ఏళ్ల త‌ర్వాత దేశవాళీ క్రికెట్ బ‌రిలోకి దిగిన కోహ్లీ, ఈ క్లాస్‌ ఇన్నింగ్స్‌తో ఆక‌ట్టుకున్నాడు.

కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, మూడు సిక్సులు ఉన్నాయి. ఇక‌, మ్యాచ్‌ ఆరంభంలో ప్రియాంశ్ ఆర్య 44 బంతుల్లో 74 పరుగులతో వేగంగా స్కోరు పెంచాడు. ఆ త‌ర్వాత నితీశ్‌ రాణా 55 బంతుల్లో 77 పరుగులు చేసి ల‌క్ష్య చేధ‌న‌ను సులభతరం చేశాడు. అయితే, కెప్టెన్ రిషభ్ పంత్ మాత్రం 5 పరుగులకే ఔటై నిరాశపరిచాడు.

కాగా, ముందుగా బ్యాటింగ్ చేసిన ఆంధ్రప్రదేశ్ 50 ఓవర్లలో 298/8 పరుగులు చేసింది. రికీ భుయ్ శతకం బాదాడు. ఢిల్లీ బౌలర్లలో సిమర్జీత్ సింగ్ ఐదు వికెట్లు తీశాడు. మొత్తం మీద కోహ్లీ అద్భుత ప్రదర్శన ఈ మ్యాచ్‌కు హైలైట్‌గా నిలిచింది.

లిస్ట్-ఏ క్రికెట్‌లో 16,000 పరుగుల ఘనత
కోహ్లీ ఈ సూప‌ర్ ఇన్నింగ్స్‌తో లిస్ట్-ఏ క్రికెట్‌లో 16,000 పరుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు. 16,000 పరుగుల ఘనతతో కోహ్లీ లిస్ట్-ఏ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ మైలురాయిని చేరుకున్న రెండవ భారతీయ ఆటగాడిగా నిలిచాడు. తన 330వ ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని సాధించాడు. టెండూల్కర్ 391 ఇన్నింగ్స్‌లలో ఈ మైల్‌స్టోన్‌ను అందుకున్నాడు. అలాగే 37 ఏళ్ల కోహ్లీ ఓవ‌రాల్‌గా ఈ మైలురాయిని చేరిన తొమ్మిదవ ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో స‌చిన్‌, రికీ పాంటింగ్, కుమార్ సంగక్కర, సర్ వివియన్ రిచర్డ్స్ వంటి క్రికెట్ దిగ్గజాలు ఉన్నారు.
Virat Kohli
Vijay Hazare Trophy
Delhi
Andhra Pradesh
Rishabh Pant
Ricky Bhui
Simarjeet Singh
domestic cricket
List A cricket

More Telugu News