AP Government: సంక్రాంతికి గ్రామాల్లో అన్న క్యాంటీన్లు

AP Government Plans Anna Canteens for Sankranti in Villages
  • గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి కానుకగా ప్రారంభం కానున్న 70 అన్న క్యాంటీన్లు
  • జనవరి 13 నుంచి 15 మధ్య క్యాంటీన్లు ప్రారంభించే యోచనలో ప్రభుత్వం
  • పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే కొనసాగుతున్న 205 క్యాంటీన్లు
గ్రామీణ ప్రజలకు సంక్రాంతి కానుకగా ఏపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ఒకేసారి 70 అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న క్యాంటీన్ల నిర్మాణ పనులు జనవరి 10లోగా పూర్తి చేయనుండగా, జనవరి 13 నుంచి 15 మధ్య క్యాంటీన్లు ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉంది.
 
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో 205 అన్న క్యాంటీన్లు ప్రారంభించి కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో రోజూ మూడు పూటలా కలిపి 2 లక్షల మందికిపైగా ప్రజలు భోజనం చేస్తున్నారు. ఉదయం, రాత్రి అల్పాహారం, మధ్యాహ్నం భోజనాన్ని పూటకు రూ.5కే అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ క్యాంటీన్లు ఏర్పాటు చేయాలన్న ఎమ్మెల్యేల విజ్ఞప్తి నేపథ్యంలో ప్రభుత్వం మరో 70 క్యాంటీన్లను మంజూరు చేసింది.
 
పట్టణాలు, నగరాల్లో కొనసాగుతున్న 205  అన్న క్యాంటీన్ల ద్వారా ఇప్పటి వరకు 7.20 కోట్ల మందికిపైగా పేదలకు ఆహారం అందించారు. వీరిలో 3.16 కోట్ల మంది మధ్యాహ్న భోజనం చేయగా, 2.62 కోట్ల మంది ఉదయం అల్పాహారం, 1.42 కోట్ల మంది రాత్రి అల్పాహారం పొందారు. విశాఖపట్నం, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అన్న క్యాంటీన్లకు అత్యధిక స్పందన లభిస్తోంది.
AP Government
Andhra Pradesh
Anna Canteens
Sankranti
Rural Areas
Subsidized Food
AP Politics
Welfare Schemes
Food Security

More Telugu News