Sajjanar: న్యూ ఇయర్ వేడుకల వేళ.. హద్దులు దాటితే కఠిన చర్యలు: హైదరాబాద్ సీపీ సజ్జనార్

Hyderabad CP Sajjanar focuses on New Year security arrangements
  • న్యూ ఇయర్ వేడుకల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్న సీపీ 
  • ఈవెంట్‌లకు పోలీస్ అనుమతి, సీసీటీవీ ఏర్పాటు తప్పనిసరి అని వెల్లడి 
  • రాత్రి 10 గంటలకే లౌడ్ స్పీకర్లు, సౌండ్ సిస్టమ్‌లు క్లోజ్ చేయాలని ఆదేశాలు 
  • ఈ నెల‌ 31న రాత్రి 9 గంటల నుంచే డ్రంకెన్ డ్రైవ్‌పై స్పెషల్ డ్రైవ్ ఉంటుందన్న సజ్జనార్ 
నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకునేలా చూడడానికి హైదరాబాద్ పోలీసులు సమాయత్తమవుతున్నారు. ఈ క్రమంలో న్యూ ఇయర్ ఈవెంట్లలో నిర్వాహకులు గానీ, ప్రజలు గానీ హద్దులు దాటినా లేక నిబంధనలు అతిక్రమించినా కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చ‌రించారు. “నిబంధనలు ఉల్లంఘిస్తే కొత్త సంవత్సరం సంతోషం లేకుండా పోతుంది” అంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు.

న్యూ ఇయర్ సందర్భంగా నగరంలో నిర్వహించే పార్టీలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన విధి విధానాలపై సీపీ సజ్జనార్ క్షేత్రస్థాయి పోలీస్ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఈవెంట్ జరిగే ప్రాంతంలో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. అలాగే పార్టీల నిర్వహణకు ముందుగా పోలీస్ అనుమతిని తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి పొందాలని సూచించారు.

బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించే వేడుకల్లో సౌండ్ సిస్టమ్‌లు, లౌడ్ స్పీకర్లు రాత్రి 10 గంటలకే పూర్తిగా నిలిపివేయాలని సీపీ స్పష్టం చేశారు. శబ్ద కాలుష్యంపై ఫిర్యాదులు వస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు, 15 షీ టీమ్స్ బృందాలను మఫ్టీలో రంగంలోకి దింపనున్నట్లు తెలిపారు.

ఈ నెల‌ 31 అర్ధరాత్రి నగరమంతటా డ్రంకెన్ డ్రైవ్‌పై ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు. రాత్రి 9 గంటల నుంచే డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ప్రారంభమవుతాయని, అన్ని ప్రధాన రహదారులు, జంక్షన్ల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. ప్రజలు ఆనందంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని, అయితే చట్టాన్ని గౌరవిస్తూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని హైదరాబాద్ పోలీసులు కోరుతున్నారు.
Sajjanar
Hyderabad police
New Year celebrations
Drunken drive
She teams
Security arrangements
Traffic rules
New Year events
Telangana
Law and order

More Telugu News