Donald Trump: ఎప్‌స్టీన్ ఫైల్స్: ట్రంప్‌పై ఆరోపణలను కొట్టిపారేసిన యూఎస్ న్యాయ శాఖ

Donald Trump US Justice Department Dismisses Epstein Allegations
  • ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ట్రంప్‌పై తీవ్ర ఆరోపణలు
  • అవన్నీ వాస్తవ విరుద్ధమైనవేనన్న అమెరికా న్యాయశాఖ
  • నిజాలను దాచే ప్రయత్నం చేస్తున్నారంటూ డెమోక్రాట్ల మండిపాటు
వివాదాస్పద వ్యాపారవేత్త జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసు దర్యాప్తుకు సంబంధించిన కొత్త పత్రాలను అమెరికా న్యాయ శాఖ (డీవోజే) మంగళవారం విడుదల చేసింది. 'ఎప్‌స్టీన్ ఫైల్స్ ట్రాన్స్‌పరెన్సీ యాక్ట్' కింద బహిర్గతం చేసిన ఈ రికార్డుల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కొన్ని తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఈ ఆరోపణలను యూఎస్ న్యాయ శాఖ పూర్తిగా తోసిపుచ్చింది. అవన్నీ వాస్తవ విరుద్ధమైనవని, కేవలం సంచలనం కోసమే చేసినవని పేర్కొంది.

ఈ తాజా ఫైల్స్‌లో ట్రంప్‌పై అత్యాచారం వంటి ఆరోపణలు ఉన్నాయి. అయితే, వీటికి ఎటువంటి ఆధారాలు లేవని అధికారులు స్పష్టం చేశారు. ‘‘ఈ ఆరోపణల్లో కనీస నిజం ఉన్నా, ఇప్పటికే వాటిని ట్రంప్‌పై అస్త్రాలుగా ప్రయోగించేవారు. 2020 ఎన్నికలకు ముందు ఎఫ్‌బీఐకి అందిన ఈ సమాచారంలో విశ్వసనీయత లేదు’’ అని న్యాయ శాఖ 'ఎక్స్' వేదికగా వివరణ ఇచ్చింది.

గతంలో ఫెడరల్ ఇన్వెస్టిగేటర్లకు అందిన కొన్ని ఫిర్యాదుల వివరాలు ఇందులో ఉన్నాయి. ఒక బాధితురాలు ట్రంప్, ఎప్‌స్టీన్‌లపై అత్యాచారం ఆరోపణలు చేసినట్లు, అలాగే ఒక లిమౌసిన్ డ్రైవర్ ట్రంప్ సంభాషణను విన్నట్లు చెప్పిన విషయాలు ఈ పత్రాల్లో ఉన్నాయి. అయితే ఈ అంశాలపై ఎఫ్‌బీఐ తదుపరి చర్యలు తీసుకుందా లేదా అన్నది స్పష్టంగా లేదు.

గతంలో అనుకున్న దానికంటే ఎక్కువసార్లు ట్రంప్.. ఎప్‌స్టీన్ ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించినట్లు ఒక ఫెడరల్ ప్రాసిక్యూటర్ రాసిన ఈమెయిల్ ద్వారా తెలుస్తోంది. గిస్లైన్ మాక్స్‌వెల్‌పై విచారణ జరుగుతున్న సమయంలో కూడా ఈ ప్రయాణాలు సాగినట్లు అందులో ఉంది. ఈ దర్యాప్తు ఫైల్స్‌లో ఎక్కడా కూడా ట్రంప్ నేరం చేసినట్లు లేదా ఆయనపై అధికారికంగా విచారణ జరిపినట్లు ప్రాసిక్యూటర్లు పేర్కొనలేదని న్యాయ శాఖ స్పష్టం చేసింది.

ట్రంప్ గత నెలలోనే ఈ పారదర్శకత చట్టంపై సంతకం చేశారు. అయితే, ఎప్‌స్టీన్‌తో కలిసి ఉన్న ఫోటోలను విడుదల చేయడం వల్ల ప్రతిష్ఠ దెబ్బతింటుందని, ఇది కేవలం మభ్యపెట్టే చర్య అని ఆయన విమర్శించారు. మరోవైపు, డెమొక్రాట్లు దీనిని ‘కవర్-అప్’ (నిజాలను దాచే ప్రయత్నం) అని అభివర్ణిస్తుండగా, చట్టం ప్రకారం తాము విడుదల చేయాల్సిన అన్ని పత్రాలను పారదర్శకంగా బయటపెడుతున్నామని న్యాయ శాఖ స్పష్టం చేసింది. బాధితుల ప్రయోజనాల దృష్ట్యా కొన్ని వివరాలను తొలగించి సుమారు 30,000 పత్రాలను ఇప్పుడు విడుదల చేశారు. రాబోయే వారాల్లో మరిన్ని లక్షలాది పత్రాలు బహిర్గతం కానున్నాయి.
Donald Trump
Jeffrey Epstein
US Department of Justice
Epstein files
Ghislaine Maxwell
FBI investigation
sex trafficking
Epstein private jet
2020 elections
transparency act

More Telugu News