Lalit Modi: పరారీలో ఉన్న అతి పెద్ద నేరగాళ్లం మేమే... భారత ను అపహాస్యం చేసిన లలిత్ మోదీ, విజయ్ మాల్యా!

Lalit Modi Vijay Mallya Mock India in Viral Video
  • విజయ్ మాల్యా పుట్టినరోజు వేడుకలో లలిత్ మోదీ వీడియో
  • మేమిద్దరమే అతిపెద్ద ఫ్యుజిటివ్స్ అంటూ వ్యాఖ్య
  • భారత ప్రభుత్వ వ్యవస్థను ఎగతాళి చేశారంటూ నెటిజన్ల ఫైర్
  • భారత్‌కు ఎప్పుడొస్తారో చెప్పాలని మాల్యాను ప్రశ్నించిన బాంబే హైకోర్టు
వేల కోట్ల రూపాయల ఆర్థిక మోసాలకు పాల్పడి దేశం విడిచి పారిపోయిన ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ, వ్యాపారవేత్త విజయ్ మాల్యా మరోసారి భారత దర్యాప్తు సంస్థలను, న్యాయవ్యవస్థను ఎగతాళి చేశారు. లండన్‌లో విజయ్ మాల్యా పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఒక వీడియోను లలిత్ మోదీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది.

విజయ్ మాల్యా బర్త్‌డే పార్టీలో తీసిన ఈ వీడియోలో లలిత్ మోదీ మాట్లాడుతూ.. "భారత్ నుంచి పరారీలో ఉన్న అతిపెద్ద నేరగాళ్లం (ఫ్యుజిటివ్స్) మేమిద్దరమే" అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, "ఇంటర్నెట్‌ను మరోసారి బ్రేక్ చేయడానికి ఏదైనా చేయాలిగా.. మీరంతా అసూయపడండి" అంటూ రెచ్చగొట్టేలా క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

"భారత ప్రభుత్వాన్ని ఎంత దారుణంగా ఎగతాళి చేస్తున్నారు", "సీబీఐ, ఈడీలను చూసి వాళ్లు నవ్వుకుంటున్నారు", "ఇలాంటి వీడియో చేసే ధైర్యం వారికి వచ్చిందంటే అది మన చట్టాల వైఫల్యమే" అంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహంతో కామెంట్లు పెడుతున్నారు.

విచిత్రం ఏమిటంటే, భారత్‌కు ఎప్పుడు తిరిగి వస్తారో చెప్పాలని విజయ్ మాల్యాను బాంబే హైకోర్టు ప్రశ్నించిన రోజే ఈ వీడియో బయటకు రావడం గమనార్హం. పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల చట్టంపై మాల్యా దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు ముందు, కోర్టు పరిధిలోకి రావాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.

విజయ్ మాల్యా రూ.9,000 కోట్లకు పైగా బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టి 2016లో దేశం విడిచి పారిపోయారు. మరోవైపు, ఐపీఎల్ బ్రాడ్‌కాస్టింగ్ హక్కుల విషయంలో రూ.125 కోట్లకు పైగా ముడుపులు తీసుకున్నారని, మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోదీ 2010లో భారత్ నుంచి పరారయ్యారు. వీరిద్దరినీ భారత్‌కు రప్పించే ప్రయత్నాలు కొనసాగుతుండగానే, వారు ఇలా బహిరంగంగా వేడుకలు జరుపుకుంటూ భారత వ్యవస్థను హేళన చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Lalit Modi
Vijay Mallya
Fugitive Economic Offenders
India
Extradition
IPL
Money Laundering
Bombay High Court
London
Birthday Party

More Telugu News