Andrew Strauss: మొదటి భార్య చనిపోయిన ఏడేళ్ల తర్వాత మళ్లీ పెళ్లి చేసుకున్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ స్ట్రాస్

Andrew Strauss remarries 7 years after wifes death
  • ఇంగ్లండ్ మాజీ క్రికెట్ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ రెండో వివాహం
  • ఆంటోనియా లీనియస్‌ను పెళ్లాడిన స్ట్రాస్
  • తొలి భార్య రూత్ క్యాన్సర్‌తో మరణించిన ఏడేళ్ల తర్వాత ఈ పెళ్లి
  • భార్య జ్ఞాపకార్థం రూత్ స్ట్రాస్ ఫౌండేషన్‌ను నడుపుతున్న స్ట్రాస్
ఇంగ్లండ్ క్రికెట్ మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. తన మొదటి భార్య రూత్ ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో మరణించిన ఏడేళ్ల తర్వాత రెండో వివాహం చేసుకున్నాడు. ఆంటోనియా లీనియస్-పీట్‌ను దక్షిణాఫ్రికాలోని ఫ్రాన్స్‌చోక్‌లో పెళ్లాడినట్లు స్ట్రాస్ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా స్వయంగా వెల్లడించాడు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను పంచుకున్నాడు.

ఈ సందర్భంగా స్ట్రాస్ భావోద్వేగపూరిత పోస్ట్ పెట్టాడు. "నన్ను, నా పిల్లలను ఎంతగానో ప్రేమిస్తున్నందుకు నీకు ధన్యవాదాలు. నిజమైన సంతోషాన్ని మాకు చూపించావు. నిన్ను కనుగొనడం నా అదృష్టం. జీవితాంతం ఇలాంటి అందమైన జ్ఞాపకాలు మనతో ఉండాలి" అని తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

స్ట్రాస్ మొదటి భార్య రూత్, ధూమపానం చేయని వారికి వచ్చే అరుదైన ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతూ 2018 డిసెంబర్ 29న మరణించింది. అప్పుడు ఆమె వయసు 46 సంవత్సరాలు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 

భార్య మరణం తర్వాత, ఆమె జ్ఞాపకార్థం 2019లో స్ట్రాస్ 'రూత్ స్ట్రాస్ ఫౌండేషన్'ను స్థాపించాడు. క్యాన్సర్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన కుటుంబాలకు మద్దతు ఇవ్వడంతో పాటు, నాన్-స్మోకింగ్ లంగ్ క్యాన్సర్‌పై పరిశోధనలకు ఈ ఫౌండేషన్ నిధులు సమకూరుస్తోంది. ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్‌ల సందర్భంగా ఏటా నిర్వహించే 'రెడ్ ఫర్ రూత్' ప్రచారానికి మంచి గుర్తింపు లభించింది.

ఆండ్రూ స్ట్రాస్ తన క్రికెట్ కెరీర్ లో 100 టెస్టులాడి 40.91 సగటుతో 7,037 పరుగులు చేశాడు. అందులో 21 సెంచరీలు, 27 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 121 వన్డేలాడి 4,205 పరుగులు సాధించాడు. వన్డేల్లో 6 సెంచరీలు, 27 ఫిఫ్టీలు అతడి ఖాతాలో ఉన్నాయి. కేవలం 4 టీ20ల్లో మాత్రమే ఇంగ్లండ్ కు ప్రాతినిధ్యం వహించాడు. 
Andrew Strauss
Andrew Strauss wedding
Ruth Strauss Foundation
England cricket
lung cancer
Antonia Linnaeus-Peat
Red for Ruth
cricket foundation
South Africa
former captain

More Telugu News