Chandrababu Naidu: సౌత్ ఇండియా రాకెట్రీ ఛాలెంజ్ 2K26 పోస్టర్‌ ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Launches South India Rocketry Challenge 2K26 Poster
  • విద్యార్థుల కోసం ఏపీ సర్కార్ సౌత్ ఇండియా రాకెట్రీ ఛాలెంజ్
  • గుంటూరు విజ్ఞాన్ యూనివర్సిటీలో జనవరి 22 నుంచి ఫైనల్స్
  • పాఠశాల, కళాశాల విద్యార్థులకు రెండు విభాగాల్లో పోటీలు
  • రిజిస్ట్రేషన్ల కోసం ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటు
రాష్ట్రంలోని పాఠశాల, కళాశాల విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక నైపుణ్యాలను, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇందులో భాగంగా 'సౌత్ ఇండియా రాకెట్రీ ఛాలెంజ్ 2K26' కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ రాకెట్రీ ఛాలెంజ్ ఫైనల్స్ 2026 జనవరి 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మూడు రోజుల పాటు గుంటూరులోని విజ్ఞాన్ యూనివర్సిటీలో జరగనున్నాయి. ఈ పోటీలను రెండు విభాగాలుగా నిర్వహిస్తున్నారు. 16 ఏళ్లకు పైబడిన కళాశాల విద్యార్థుల కోసం 'కెమికల్ రాకెట్రీ', 6 నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న పాఠశాల విద్యార్థుల కోసం 'హైడ్రో రాకెట్రీ' విభాగాల్లో పోటీలు ఉంటాయి.

సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ముఖ్యమంత్రికి వివరించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను, ఆలోచనలను వెలికితీయడమే ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని వారు తెలిపారు.

ఈ పోటీల్లో పాల్గొనాలని ఆసక్తి ఉన్న విద్యార్థులు, యువత.. ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ sciencecity.ap.gov.in/rocketry_challenge.aspx ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.
Chandrababu Naidu
South India Rocketry Challenge
Andhra Pradesh
Science City of Andhra Pradesh
Vignan University
Guntur
Chemical Rocketry
Hydro Rocketry
Student Innovation
BC Janardhan Reddy

More Telugu News