Nidhhi Agerwal: హీరోయిన్లపై శివాజీ వ్యాఖ్యలు, నిధి అగర్వాల్ పట్ల ఫ్యాన్స్ ప్రవర్తన... 'మా'కు నందిని రెడ్డి, మంచు లక్ష్మి ఫిర్యాదు

Nidhhi Agerwal Harassment Issue Complaint to MAA
  • శివాజీ మహిళల గురించి అవమానకరంగా మాట్లాడారన్న వాయిస్ ఆఫ్ వుమెన్
  • సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచన
  • నిధి అగర్వాల్ పట్ల అభిమానుల ప్రవర్తన సరికాదన్న వాయిస్ ఆఫ్ వుమెన్
సినీ నటుడు శివాజీ హీరోయిన్లపై చేసిన వ్యాఖ్యలు, లులు మాల్‌లో నటి నిధి అగర్వాల్ పట్ల అభిమానుల ప్రవర్తనపై 'వాయిస్ ఆఫ్ వుమెన్' పేరుతో పలువురు మహిళా సినీ ప్రముఖులు 'మా' అధ్యక్షుడు మంచు విష్ణుకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నందిని రెడ్డి, సుప్రియ యార్లగడ్డ, స్వప్నదత్, మంచు లక్ష్మి, ఝాన్సీ తదితరులు 'మా' అధ్యక్షుడికి ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు.

దండోరా సినిమా ప్రమోషన్ ప్రెస్‌మీట్‌లో శివాజీ చేసిన వ్యాఖ్యలపై తాము తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని వాయిస్ ఆఫ్ వుమెన్ ఆ లేఖలో పేర్కొంది. శివాజీ తన ప్రసంగంలో మహిళల గురించి అవమానకరంగా మాట్లాడారని తెలిపింది. ఇలాంటి వ్యాఖ్యలు అనుచితం మాత్రమే కాదని, తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. చిత్ర పరిశ్రమ నుంచి ప్రయోజనం పొందే, ప్రభావితం చేసే వ్యక్తులు మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

శివాజీ ఉపయోగించిన పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయని, ఇది శిక్షార్హమైన నేరమని పేర్కొంది. స్త్రీల వ్యక్తిగత విషయాలపై మాట్లాడటం దారుణమని తెలిపింది. తాను చేసిన వ్యాఖ్యలకు గాను శివాజీ బహిరంగంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని వాయిస్ ఆఫ్ వుమెన్ డిమాండ్ చేసింది. లేకుంటే చట్టపరంగా ముందుకు వెళతామని హెచ్చరించింది. ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు చిత్ర పరిశ్రమ నిశ్శబ్దంగా ఉండటం సరికాదని పేర్కొంది.

అటు, లులు మాల్‌లో నటి నిధి అగర్వాల్ పట్ల అభిమానుల ప్రవర్తనపై కూడా వాయిస్ ఆఫ్ వుమెన్ తీవ్రంగా స్పందించింది. ఈవెంట్‌లో పాల్గొనడానికి వచ్చిన నిధిని అసభ్యంగా తాకడం క్షమించరాని నేరమని పేర్కొంది. మహిళలపై ఇలాంటి ఘటనలు జరుగుతుంటే పోలీసులు నైతిక బాధ్యత వహించి చర్యలు తీసుకోవాలని కోరింది. మహిళల భద్రత, గౌరవానికి భంగం కలిగినప్పుడు నిశ్శబ్దంగా ఉంటే ఎలా అని ప్రశ్నించింది.
Nidhhi Agerwal
Shivaji
MAA Association
Manchu Vishnu
Nandini Reddy
Lakshmi Manchu

More Telugu News